భారత కెప్టెన్ రోహిత్ శర్మ పుల్ షాట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుల్ షాట్స్ ఆడగలిగే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. అయినప్పటికీ ఆ ఒక్క షాట్ ఆడకుండా ఉంటే చాలా మంచిదని క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అంటున్నారు. కనీసం ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించే వరకు ఆ షాట్ ఆడకుండా ఉండాలని హిట్‌మ్యాన్‌ను కోరారు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో, రోహిత్ 29 పరుగుల వద్ద ఔట్ అయ్యే వరకు బాగానే ఆడుతూ కనిపించాడు. లహిరు కుమార బౌలింగ్ లో రోహిత్ శర్మ పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. మంచి ఆరంభం లభించినా, భారీ ఇన్నింగ్స్ గా మార్చడంలో రోహిత్ శర్మ విఫలమయ్యాడు. క్రీజులో ఎక్కువసేపు నిలదొక్కుకోవాలంటే.. టెస్ట్ మ్యాచ్ లో కొన్ని ఇతర షాట్‌లపై ఎక్కువ దృష్టి పెట్టాలని రోహిత్‌కి సలహా ఇచ్చారు గవాస్కర్.
"రోహిత్ ఆ షాట్ గురించి ఆలోచించాలి. ఇది అతని బెస్ట్ షాట్ అని మీరు వాదించవచ్చు. కానీ ఆ ఒక్క షాట్ మాత్రమే అతడికి ఆడడం వచ్చని అనుకోకండి. అతను చాలా మంచి షాట్స్ ఆడగలడు. కొంచెం పేస్ ఉన్న బౌలర్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు లేదా బౌండరీల కోసం వెళ్లడం నాకు అభ్యంతరం లేదు, కానీ అతను బంతిని గాలిలో కొట్టడం వల్ల అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది" అని వివరించాడు గవాస్కర్. పరిమిత ఓవర్ల క్రికెట్ విషయానికి వస్తే, రోహిత్ పుల్ షాట్ల ద్వారా పుష్కలంగా పరుగులు సాధించాడు. నిజానికి, అతను ఫైన్-లెగ్ బౌండరీపై పేసర్ల బౌలింగ్ లో కొట్టడం అభినానులకు చాలా ఇష్టం. టెస్ట్ మ్యాచ్ లలో మాత్రం ఈ పుల్ షాట్స్ రోహిత్ కు నష్టాన్ని తెస్తున్నాయి.