చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి, విజేతగా కార్ల్‌సన్
ఫిడే చెస్ వరల్డ్ కప్ చాంపియన్‌గా ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు.
By Srikanth Gundamalla Published on 24 Aug 2023 12:23 PM GMTచెస్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓటమి, విజేతగా కార్ల్‌సన్
ఫిడే చెస్ వరల్డ్ కప్ చాంపియన్‌గా ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు. భారత యువ ఆటగాడు 18 ఏళ్ల ప్రజ్ఞానంద ప్రపంచ కప్‌లో అద్భత ప్రదర్శనను ఇచ్చాడు. కానీ చివర్లో ఒత్తిడికి గురై విజేతగా నిలవలేకపోయాడు. టై బ్రేక్‌కు వెళ్లిన ఫైనల్‌లో కార్ల్‌సన్ దూకుడుగా చెస్ పావులను కదిపి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన టై బ్రేక్స్‌లో ప్రజ్ఞానంద తొలి గేమ్ కోల్పోయి, రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా కార్ల్‌సన్ విజేతగా నిలిచాడు.
అజర్ బైజాన్ లోని బాకు నగరంలో ఈ మెగా ఈవెంట్ జరుగుతోంది. కార్ల్ సన్, ప్రజ్ఞానంద మధ్య ఫైనల్లో రెండు క్లాసికల్ గేమ్ లు డ్రాగా ముగియడంతో, టై బ్రేక్ లో భాగంగా ర్యాపిడ్ రౌండ్ నిర్వహించారు. తొలిగేమ్ లో కార్ల్ సన్ గెలిచాడు. ఆ తర్వాత రెండో గేమ్ డ్రాగా ముగిసింది. ప్రపంచ చాంపియన్‌గా అవతరిద్దామని భావించిన ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలవాల్సి వచ్చింది. రెండో గేమ్ లో ప్రజ్ఞానంద గెలిచి ఉంటే, ఈ పోరు బ్లిట్జ్ రౌండ్ కు దారితీసేది. కానీ, రెండో గేమ్ ను ప్రజ్ఞానంద డ్రా చేసుకోవడంతో కార్ల్ సన్ ప్రపంచకప్ విజేతగా అవతరించాడు. కాగా.. విజేతగా నిలిచిన కార్ల్‌సన్ రూ.91 లక్షలు, రన్నరప్‌గా నిలిచిన ప్రజ్ఞానంద రూ.66 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటారు. కార్ల్‌సన్‌కి ఇదే తొలి వరల్డ్ కప్ కావడం విశేషంగా నిలిచింది.