ఎంఎస్ ధోనీ జెర్సీకి బీసీసీఐ అరుదైన గౌరవం
ధోనీ జెర్సీ నంబర్ 7కి కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
By Srikanth Gundamalla Published on 15 Dec 2023 6:10 PM ISTఎంఎస్ ధోనీ జెర్సీకి బీసీసీఐ అరుదైన గౌరవం
క్రికెట్ అంటే ఎవరికైనా గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. ఆయన్ని అందరూ క్రికెట్ గాడ్ అంటుంటారు. ఆయన తర్వాత ఇండియన్ క్రికెట్‌లో ఫేమ్ ఉంది ఎవరు అంటే.. ఎక్కువ మంది ఎంఎస్ ధోనీ పేరు చెబుతారు. సచిన్ టన్నుల కొద్దీ పరుగులు చేసి భారత్ ప్రతిష్టను పెంచగా.. ధోనీ రెండు వరల్డ్ కప్‌లను భారత్‌కు అందించి దేశాన్ని విశ్వవిజేతగా నిలిపాడు. ఇంతటి ఘనతను సాధించిన వీరిద్దరినీ క్రికెట్ ప్రపంచం.. టీమిండియా అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అయితే..సచిన్ టెండూల్కర్‌ను గౌరవిస్తూ ఆయన జెర్సీ నెంబర్ 10కి రిటైర్మెంట్ ప్రకటించింది బీసీసీఐ. అలాగే ఇప్పుడు ధోనీ జెర్సీ నంబర్ 7కి కూడా రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
సచిన్ జెర్సీ నెంబర్ 10కి రిటైర్మెంట్ ఇచ్చినట్లుగానే.. ధోనీ జెర్సీ నెంబర్ 07కి కూడా రిటైర్మెంట్ ఇచ్చి గౌరవించాలని పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐకి సూచించారు. ఇదే డిమాండ్ ధోనీ అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ధోనీ జెర్సీకి ఈ అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. ధోనీ జెర్సీ నెంబర్ 7కు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు బీసీసీఐ తాజాగా ప్రకటించింది. టీమిండియాకు ధోనీ చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం ఇస్తున్నామని పేర్కొంది. ధోనీకి చెందిన జెర్సీ నెంబర్ 7ని ఎవరూ ఇక ఎంచుకోవడానికి వీలు లేదనీ.. అది ఎంచుకోవద్దని ప్రస్తుత ఆటగాళ్లకు బీసీసీఐ సూచించింది.
2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే.. ధోనీ అప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని అనుకున్నాడట. కానీ.. తన నిర్ణయాన్ని మాత్రం 2020 ఆగస్టు 15న తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. గత 2023 ఐపీఎల్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను చాంపియన్‌గా నిలిపాడు. తద్వారా తన కెప్టెన్సీని మరోసారి చాటుకున్నాడు. కాగా.. ప్రస్తుతం ధోనీ జెర్సీ రిటైర్మెంట్ బీసీసీఐ ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.