టైటిల్ విని ముందుగా ఏవేవో ఫిక్స్ అవ్వకండి..! ఎందుకంటే ఇది పాలిటిక్స్ పరంగా కాదు.. క్రీడల పరంగా..! గుజరాత్ క్రికెట్ సంఘం (జీసీఏ) నూతన అధ్యక్షుడిగా ధన్ రాజ్ పరిమళ్ నత్వానీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక, ఎన్నికలు జరపడం ఇదే ప్రథమం. ఇందులో ఏకగ్రీవంగా ధన్ రాజ్ ఎన్నికయ్యారు. ఆయనకు బీసీసీఐ కార్యదర్శి జై షా శుభాకాంక్షలు తెలియజేశారు. ధన్ రాజ్ నత్వానీ ఇప్పటి వరకు జీసీఏ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.
తాజా కార్యవర్గంలో జీసీఏ ఉపాధ్యక్షుడిగా హేమంత్ భాయ్ కాంట్రాక్టర్, కార్యదర్శిగా అనిల్ భాయ్ పటేల్, సంయుక్త కార్యదర్శిగా మయూర్ భాయ్ పటేల్, కోశాధికారిగా భరత్ జవేరీ బాధ్యతలు చేపట్టనున్నారు. గుజరాత్ క్రికెట్ సంఘానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో 2009లో జీసీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన తర్వాత 2014లో జీసీఏ అధ్యక్షుడిగా అమిత్ షా పదవిని చేపట్టారు. ఇప్పుడు అమిత్ షా స్థానంలో ధన్ రాజ్ పరిమళ్ నత్వానీ నూతన అధ్యక్షుడు అయ్యారు. నత్వానీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం. ఇది 63 ఎకరాలలో విస్తరించి ఉంది. 1.3 లక్షల మంది అభిమానులు కూర్చునే అవకాశం ఉంది.