వరల్డ్ కప్ ట్రోఫీని అవమానించిన మిచెల్‌పై కేసు నమోదు
వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్ చిక్కుల్లో పడ్డాడు.
By Srikanth Gundamalla Published on 24 Nov 2023 6:47 AM GMTవరల్డ్ కప్ ట్రోఫీని అవమానించిన మిచెల్‌పై కేసు నమోదు
వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాపై గెలిచి ఆరో సారి ట్రోఫీని సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. అయితే.. చివరి మ్యాచ్‌లో వారు ఆడిన తీరుని అందరూ ప్రశంసించారు. కానీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆస్ట్రేలియా ఆటగాడి వ్యవహారంపై మాత్రం క్రికెట్ అభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రోఫీని గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆతర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్.. ట్రోఫీపై కాళ్లు పెట్టి.. కుర్చీలో కూర్చొని బీరు తాగుతూ కనిపించాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాలా మంది అతడి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా దేశాలు ఆ ట్రోఫీని గౌరవంగా చూసుకుంటాయని.. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం భిన్నంగా ఉన్నారంటూ విమర్శించారు.
మిచెల్ మార్ష్‌పై విమర్శలు వెల్లివెత్తుతూనే ఉన్నాయి. అంతేకాదు.. ఉత్తర్ ప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఏకంగా.. ఢిల్లీ గేట్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన మిచెల్ మార్ష్ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయని. అలా ట్రోఫీని అవమానించడంతో పాటు 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను గాయపరిచారని కేశవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ గేట్ పోలీసులు మిచెల్ మార్ష్‌పై కేసు నమోదు చేశారు.
మిచెల్ మార్ష్ తీరుపై టీమిండియా స్టార్ పేసర్ షమీ కూడా స్పందించాడు. మిచెల్ అలా చేయడం తనని తీవ్రంగా బాధించిందని పేర్కొన్నాడు. ఎన్నో జట్లు వరల్డ్ కప్‌లో ట్రోఫీ కోసం పోరాడాయని.. అలాంటి ట్రోఫీని తలపై పెట్టుకోవాలి కానీ కాళ్లు పెట్టకూడదని అన్నాడు. తనకు మిచెల్ మార్ష్ వ్యవహించిన తీరు ఏమాత్రం నచ్చలేదని షమీ చెప్పాడు. మిచెల్ మార్ష్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఫొటోలు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో విమర్శలు వెల్లివెత్తాయి. చివరకు మిచెల్‌పై కేసు నమోదు అయ్యింది.