ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా

ఐర్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు బుమ్రా.

By Srikanth Gundamalla  Published on  1 Aug 2023 7:01 AM IST
Bumrah, captain,  t20 series, Ireland ,

 ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా బుమ్రా

బుమ్రా ఎప్పుడు టీమిండియాలోకి తిరిగి వస్తాడా అని క్రీడాభిమానులు చాలా ఎదురు చూశారు. ఇప్పుడు ఏకంగా అతడిని టీమిండియా ఐర్లాండ్‌ టూర్‌కు కెప్టెన్‌ను చేసేసింది బీసీసీఐ. గతేడాది సెప్టెంబర్‌ నుంచి గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు బుమ్రా. తాజాగా అతడు ఫిట్‌నెస్‌ సాధించడంతో మళ్లీ టీమిండియాలోకి వచ్చేశాడు. ఈసారి ఏకంగా కెప్టెన్‌గానే అడుగు పెట్టేశాడు. ఐర్లాండ్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు సారథ్యం వహించనున్నాడు బుమ్రా. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ పూర్తిగా యువ ఆటగాళ్లనే సెలెక్ట్‌ చేసింది. సీనియర్లకు రెస్ట్‌ ఇచ్చింది.

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ టీమ్ కు బుమ్రా కెప్టెన్ కాగా.. రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్. వెన్ను గాయానికి సర్జరీ తర్వాత కొంతకాలంగా నేషనల్ క్రికెట్ అకాడెమీలో బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మధ్యే పూర్తి ఫిట్‌నెస్ తో బుమ్రా నెట్స్ లో బౌలింగ్ చేసిన వీడియో కూడా బయటకు వచ్చింది. బుమ్రా పూర్తి ఫిట్‌గా ఉన్నాడని కెప్టెన్ రోహిత్, బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా సమాచారం ఇచ్చారు. మొత్తానికి 11 నెలల గ్యాప్ తర్వాత బుమ్రా మళ్లీ ఇండియన్ టీమ్ లో అడుగుపెట్టాడు.

ఊహించినట్లే ఐర్లాండ్ సిరీస్ కు సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టారు సెలక్టర్లు. ఐపీఎల్ స్టార్లతో జట్టును నింపేశారు. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మెరుపులు మెరిపించిన రింకు సింగ్.. తొలిసారి ఇండియన్ టీమ్‌కు ఎంపిక కావడం విశేషం. యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మకు కూడా సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఏషియన్ గేమ్స్ లో టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కే ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ అప్పజెప్పాలని ముందు బీసీసీఐ భావించింది. కానీ.. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడానికి బుమ్రా ఆసక్తి కనబర్చాడట. అందుకే ఆ కెప్టెన్‌గా బుమ్రానే ఎంపిక చేసింది బీసీసీఐ. గతేడాది ఇంగ్లండ్‌లో ఇండియా ఆడిన చివరి టెస్టులో రోహిత్‌ శర్మ అందుబాటులో లేకపోవడంతో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఏడాది తర్వాత టీమ్‌లోకి రావడమే కాకుండా.. ఏకంగా కెప్టెన్‌గా బుమ్రా అడుగు పెట్టేశాడు.

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడనున్న టీమిండియా:

జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ముఖేశ్ కుమార్, అవేష్ ఖాన్.

బుమ్రా దాదాపు ఏడాది నుంచి గాయం కారణంగా ఏ మ్యాచూ ఆడలేదు. దాంతో.. అతన్ని కెప్టెన్‌గా నియమించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. క్రికెట్‌కే దూరంగా ఉన్న అతన్ని ఏకంగా కెప్టెన్‌ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో అని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.


Next Story