వెస్టిండీస్ క్రికెట్‌కు బ్రావో గుడ్ బై.. అందుకేనా..?
ఇకపై వెస్టిండీస్ తరఫున ఆడకూడదని డారెన్ బ్రావో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు.
By Srikanth Gundamalla
వెస్టిండీస్ క్రికెట్‌కు బ్రావో గుడ్ బై.. అందుకేనా..?
వెస్టిండీస్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై దేశం తరఫున ఆడకూడదని డారెన్ బ్రావో నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు. అయితే.. ఇంగ్లండ్ పర్యటనకు తనని ఎంపిక చేయకపోవడంతో డారెన్ బ్రావో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తాను ఇక దేశం తరఫున ఆడబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ స్టార్ బ్యాటర్ ప్రకటనతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
వెస్టిండీస్ క్రికెట్‌లో మరోసారి లుకలుకలు మొదలు అయ్యాయి. ఇంగ్లండ్ పర్యటనకు తనను పక్కన పెట్టారని.. సెలెక్టర్లు కనీసం సమచారం ఇవ్వలేదన్నాడు బ్రావో. తనను చిమ్మ చీకట్లో వదిలేశారని అన్నాడు. ఈ మేరకు తాను దేశం తరఫున ఆడేందుకు దూరంగా ఉన్నట్లు చెప్పాడు. ఇన్‌స్టాలో పోస్టు పెట్టిన డారెన్ బ్రావో.. ప్రస్తుత సమయంలో ఆటలో కొనసాగాలంటే మరింత శక్తి కావాలని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన శక్తి సామర్థ్యం మేరకు రాణించేందుకు టైమ్ పడుతుందని.. మూడు ఫార్మాట్లలో 40-45 మంది ఆటగాళ్లు అవసరం అని అన్నాడు. కానీ.. వారిలో తాను లేకపోవడం బాధాకరమని పేర్కొన్నాడు. ప్రాంతీయ టోర్నీల్లో పరుగులు సాధించినా.. సెలెక్టర్లు తనని పక్కకు పెట్టేశారని వాపోయాడు. అలాగని తాను ఆశలు వదిలేసుకోబోను అని.. ప్రతిభావంతుడైన యువకుడికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్ చెప్పాడు బ్రావో. తన కలను నిజం చేసుకున్నానని డారెన్ బ్రావో భావోద్వేగం వ్యక్తం చేశాడు.
వెస్టిండీస్ క్రికెటర్ బ్రావో గత నాలుగేళ్ల నుంచి నిలకడగా ఆడుతున్నాడు. ప్రతి ఇన్నింగ్స్‌లో 96.2, 65.0, 89.2 సగటుతో బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు.. ఈ మధ్యే స్వదేశంలో జరిగిన సీజీ యునైటెడ్ సూపర్ 50లో రెడ్ ఫోర్స్ జట్టు విజేతగా నిలవడంతో బ్రావో పాత్ర కీలకంగా మారింది. ఈ టోర్నీలో బ్రావో 416 రన్స్‌తో గోల్డెన్ బ్యాటు కూడా అందుకున్నాడు. ఇలా అన్ని విధాలుగా రాణించినా.. బెస్ట్ బ్యాటర్ అని నిరూపించుకున్నా సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. దాంతో బ్రావో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఆ క్రమంలోనే దేశ తరుఫున ఇక ఆడబోనని వెల్లడించాడు డారెన్ బ్రావో.