బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చేశాడు!
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా.. త్వరలోనే ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది.
By Srikanth Gundamalla Published on 27 Aug 2024 12:15 PM ISTబీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చేశాడు!
బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జైషా.. త్వరలోనే ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. జైషా ఐసీసీ చైర్మన్‌గా వెళ్తే.. మరి బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఉంటారనే దానిపై ప్రస్తుతం క్రీడావర్గాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా తెగ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ కార్యదర్శిగా ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ బాధ్యతలు తీసుకుంటారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా రోహన్ జైట్లీ స్పందించారు. తాను బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోబోతున్నారనే వార్తలను ఖండించాడు. అవన్నీ తప్పుడు కథనాలే అని చెప్పేశారు. అయితే.. ప్రస్తుతం తాను ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ను చూసుకుంటున్నాననీ.. తన ఫోకస్ అంతా దానిపైనే ఉందని చెప్పాడు. కాగా.. రోహన్ జైట్లీ దివంగత బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ కుమారుడు. తండ్రి లాగే రోహన్ జైట్లీ కూడా న్యాయవిద్యను అభ్యసించాడు. నాలుగేళ్ల కిందటే ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఎన్నిక అయ్యాడు.
కాగా.. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్‌గా గ్రెగ్ బార్క్‌లే ఉన్నారు. ఆయన పదవీ కాలం నవంబర్‌లో ముగియనుంది. ఆయన మరో పదవీకాలం పాటు కొనసాగేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దాంతో.. ఐసీసీ చైర్మన్‌గా జైషా ఎన్నిక లాంచనమే అంటున్నారు. అయితే.. 16 మంది సభ్యుల్లో 15 మంది మద్దతు జైషాకే ఉంది. మరి ఆయన ఐసీసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేస్తారా లేదా తెలియాల్సి ఉంది. ఇవాళే నామినేషన్ దాఖలుకి చివరి తేదీ కావడం గమనార్హం. బీసీసీఐ కార్యదర్శి రేసులో బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కోశాధికారి ఆశిష్ షెలార్, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధూమల్ సహా మరికొందరు ఉన్నారు.