టీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం.. అర్హతలివే..
భారత క్రికెట్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.
By Srikanth Gundamalla Published on 14 May 2024 10:22 AM ISTటీమిండియా హెడ్ కోచ్ దరఖాస్తులకు బీసీసీఐ ఆహ్వానం.. అర్హతలివే..
భారత క్రికెట్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు సోమవారమే ఒక ప్రకటనను విడుదల చేసింది బీసీసీఐ. త్వరలోనే టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీ తర్వాత ప్రస్తుతం మెన్స్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తుంది. ఇక జూన్ చివరి నాటికి కోచ్ పదవి నుంచి వైదొలుగుతారు. ఆ తర్వాత బీసీసీఐ మెన్స్ టీమ్‌కు కొత్త కోచ్‌ను నియమించనుంది బీసీసీఐ. ఈ మేరకు ఇప్పటి నుంచే దరఖాస్తులను ఆహ్వానించింది.
కొత్తగా నియామకం అయ్యే కోచ్ పదవీ కాలం ఈ ఏడాది జులై 1వ తేదీ నుంచి 2027 డిసెంబర్ 31వ తేదీ వరకు కొనసాగుతుందని బీసీసీఐ అధికారులు తెలిపారు. కొత్తగా కోచ్ పదవికి ఎంపిక అయిన వారు 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ వరకు భారత క్రికెట్ జట్టుకి హెడ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. ఇక బీసీసీఐ తన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. కొత్త కోచ్‌కు 14 నుంచి 16 మంది వరకు సహాయ సిబ్బంది ఉంటారని తెలిపింది. మూడు ఫార్మట్లలో జట్టుకు హెడ్ కోచ్‌గా కొనసాగుతారని పేర్కొంది. టీమ్ ప్రదర్శన, నిర్వహణకు ప్రధాన కోచ్ పూర్తి బాధ్యత వహిస్తాడని తెలిపింది. భారత జట్టులోని క్రమశిక్షణా కోడ్‌లను సమీక్షించడం, నిర్వహించడం, అమలు చేయడం ప్రధాన కోచ్ బాధ్యత" అని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.
అలాగే హెడ్ కోసం దరఖాస్తులు చేసుకునే వారికి ఉండాల్సిన అర్హతలకు సంబంధించిన వివరాలను కూడా బీసీసీఐ పేర్కొంది. కనీసం 30 టెస్టు మ్యాచ్‌లు లేదంటే 50 వన్డే మ్యాచ్‌లు ఆడి ఉండాలని బీసీసీఐ తెలిపింది. టెస్టు క్రికెట్ ఆడే దేశానికి ప్రధాన కోచ్‌గా కనీసం 2 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం అయినా ఉండాలని చెప్పింది. ఐపీఎల్ జట్టు లేదా సమానమైన ఇతర లీగ్‌ల జట్లకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్లు పనిచేసి ఉండాలని బీసీసీఐ పేర్కొంది. లేదంటే బీసీసీఐ లెవల్ 3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలని వివరించింది. ఈ కండీషన్లలో ఏది ఉన్నా కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారని బీసీసీఐ పేర్కొంది. చివరగా 60 ఏళ్ల వయసు కంటే తక్కువ వయసు ఉన్నవారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది.