రోహిత్ వికెట్ తీసినప్పుడు ఎంజాయ్ చేశా: పాక్ బౌలర్ షహీన్
పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది తన గేమ్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడు.
By Srikanth Gundamalla Published on 3 Sept 2023 3:00 PM ISTరోహిత్ వికెట్ తీసినప్పుడు ఎంజాయ్ చేశా: పాక్ బౌలర్ షహీన్
ఆసియా కప్‌లో ఎంతో ఎదరు చూసిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. టీమిండియా టాప్ ఆర్డర్ విఫలమైనా.. ఆ తర్వాత ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా కలిసి స్కోర్ బోర్డుని కదిలించారు. అయితే.. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఎదురుచూసినా అభిమానులకు సగం జోష్ మాత్రమే అందిందని చెప్పాలి. కేవలం ఒక్క ఇన్నింగ్స్ ఆట మాత్రమే సాగడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు.
పాక్ పేసర్లు విజృంభించడంతో పది వికెట్లు కోల్పోయింది టీమిండియా. మరీ ముఖ్యంగా పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది తన గేమ్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేశాడు. కీలక వికెట్లను వెంట వెంటనే తీసి భారత్‌పై ఒత్తిడి పెంచాడు. అలాగే సెకండ్ స్పెల్‌లోనూ మరోసారి వికెట్లను తీశారు షహీన్. తాను వేసిన 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 4 వికెట్లను తీసుకున్నాడు. ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బౌల్డ్ చేశాడు. అలాగే స్లో బంతితో కీలక ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ పాండ్యాను బోల్తా కొట్టించాడు. మరో ఆఫ్‌సైడ్ బాల్ వేసి జడేజాను పెవిలియన్‌కు పంపించాడు షహీన్. అయితే.. నాలుగు వికెట్లలో రోహిత్ శర్మను బౌల్డ్ చేసినప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేసినట్లు షహీన్ అఫ్రిది చెప్పాడు.
కొత్త బంతితో త్వరగా వికెట్లు తీయాలనేది తమ గేమ్ ప్లాన్ అని షహీన్ అఫ్రిది చెప్పాడు. భారత్ మ్యాచ్‌లో ఇదే జరిగిందని అన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు చాలా కీలకమని.. అయితే వారిద్దరినీ బౌల్డ్ చేయడం ఆనందంగా అనిపించిందని షహీన్ అన్నాడు. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ తీయడం ఎక్కువ ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు. పేసర్లుగా తాము అనుకున్న విధంగా రాణించామని.. నసీమ్ షా 150 కి.మీ వేగంతో బంతులను వేస్తున్నాడని చెప్పాడు. కొత్త బంతి స్వింగ్ అవుతున్న కారణంగా పరుగులు చేయడం కష్టమే అని అన్నాడు షహీన్. చేదనలో కాస్త నిలదొక్కుకుని బంతి పాతబడే వరకు వేచి చూస్తే పరుగులు చేయొచ్చిన అన్నాడు. కానీ వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం నిరాశకు గురి చేసిందని పాక్ పేసర్ షహీన్ ఆఫ్రిది అన్నాడు.
ఆసియా కప్‌లో తొలిసారి ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లూ తీసిన జట్టుగా పాకిస్థాన్ అవతరించింది. ఈ మ్యాచ్‌లో షహీన్ 4, రవూఫ్ 3, నసీమ్ 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు 9 వికెట్లు తీసిన రికార్డు కూడా పాక్ పేరిటే ఉంది.