నేపాల్ టీమ్‌ను సత్కరించిన టీమిండియా.. ఎందుకంటే..

టీమిండియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొని బ్యాటింగ్‌లో రాణించిన నేపాల్‌ ఆటగాళ్లను సత్కరించారు.

By Srikanth Gundamalla  Published on  5 Sept 2023 5:11 PM IST
Asia Cup-2023, indian cricketers, felicitated, nepal Batters,

నేపాల్ టీమ్‌ను సత్కరించిన టీమిండియా.. ఎందుకంటే..

ఆసియాకప్‌ చరిత్రలో తొలిసారి నేపాల్‌ టీమ్‌ భాగం అయ్యింది. అయితే.. ఆసియాకప్-2023లో నేపాల్‌ ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. కానీ.. తమ అద్భుతమైన ఆట ప్రదర్శనతో అందరి మనసులను దోచుకున్నారు. భారత్‌, పాకిస్తాన్‌ వంటి బలంగా ఉన్న జట్లపై నేపాల్‌ చూపించిన పోరాట పటిమ.. చిన్న జట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. కాగా.. సెప్టెంబర్ 4వ తేదీన భారత్‌తో తలపడ్డ నేపాల్‌ టీమ్ ఓటమిని చవి చూసింది. అయితే..టీమిండియా బౌలర్లను ఎదుర్కొంటూ వారు బ్యాటింగ్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. కాగా క్యాండీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.

అయితే.. పాకిస్తాన్‌పై బౌలింగ్‌లోనూ సత్తా చాటింది నేపాల్ క్రికెట్‌ టీమ్. టీమిండియాతో ఆడిన మ్యాచ్‌లో షమీ, సిరాజ్‌ వంటి వరల్డ్‌క్లాస్‌ బౌలర్లకు నేపాల్‌ బ్యాటర్లు ఆడిన తీరు ఎంత చెప్పుకున్న తక్కువే. స్కోర్‌ బోర్డును బాగానే తరలించారు. దాంతో.. వారి ఆటతీరుకు టీమిండియా ఆటగాళ్లు కూడా ఫిదా అయిపోయారు. దాంతో.. వారిని సత్కరించింది. మరోసారి టీమిండియా క్రీడా స్ఫూర్తిని చాటింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం నేపాల్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లింది భారత జట్టు. టీమిండియాను చూసిన నేపాల్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

అయితే.. టీమిండియా బౌలర్లను ధాటిగా ఎదుర్కొని బ్యాటింగ్‌లో రాణించిన ఆటగాళ్లను సత్కరించారు. నేపాల్‌ ఆటగాళ్లకు మెడల్స్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా నేపాల్ ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకున్నారు. వారితోపాటే ఉన్న టీమిండియా హెచ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా నేపాలీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఇదంతా అక్కడే ఉన్న కొందరు ఆటగాళ్లు వీడియో తీశారు. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా వైరల్ అవుతోంది. టీమిండియా జట్టు అంటే ఇలాగే ఉంటుందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

Next Story