భారత్‌-నేపాల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకి..?

భారత్‌-నేపాల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  3 Sep 2023 12:35 PM GMT
Asia Cup-2023, India Vs Nepal, Rain Alert,

భారత్‌-నేపాల్‌ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకి..?

ఆసియా కప్‌-2023లో భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతగానో ఎదరు చూశారు. కానీ.. వర్షం కారణంగా మ్యాచ్‌ సగంలోనే ఆగిపోయింది. టీమిండియా బ్యాటింగ్‌ చూసినా కానీ.. మ్యాచ్‌ ఫలితం తేలలేదు. బౌలింగ్ కూడా చేసి గెలిస్తే ఆ కిక్‌ వేరేగా ఉండేది. అయితే.. వరుణుడు అప్పటికే రెండు సార్లు కురిసి బ్యాటర్లకు కూడా ఇబ్బంది కలిగేలా చేశాడు. పల్లెకలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండుసార్లు వర్షం అంతరాయాల తర్వాత భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. వర్షం పడిన బ్రేక్‌ తర్వాత ప్రతిసారి బ్యాటర్లు తడబడ్డ విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ చేయకుండానే మ్యాచ్‌ రద్దు అయ్యింది. దాంతో.. చెరో పాయింట్‌ దక్కింది.

అయితే.. భారత్‌ సెప్టెంబర్ 4న భారత్‌ మరో మ్యాచ్‌ ఉంది. నేపాల్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డు పడుతుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భారత్‌, నేపాల్‌ మధ్య జరిగే మ్యాచ్‌ కూడా పల్లెకెలె వేదికగానే జరగనుంది. సెప్టెంబర్ 3న 80 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం ప్రభావం వల్ల టాస్‌ కూడా ఆలస్యం అయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. మ్యాచ్‌ జరిగే సమయంలో కూడా జల్లులు కురుస్తాయని.. మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడుతుందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు.

వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు కావడంతో భారత్, పాకిస్తాన్‌కు చెరో పాయింట్ లభించింది. గ్రూప్‌-ఏలో నేపాల్‌పై పాకిస్తాన్‌ ఒక విజయంతో పాటు.. మరో పాయింట్‌తో కలిపి సూపర్‌-4కి దూసుకెళ్లింది. నేపాల్‌తో మ్యాచ్‌ జరిగితే భారత్‌ విజయం సాధించడం పక్కా. ఒక వేళ వరుణుడు అడ్డుపడితే మాత్రం భారత్‌కు రెండు పాయింట్లు ఉంటాయి. టీమిండియా సూపర్‌-4కు అర్హత సాధించి నేపాల్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సూపర్‌-4లో భాగంగా సెప్టెంబర్‌ 10న భారత్‌, పాకిస్తాన్‌ టీమ్‌లు మరోసారి తలపడనున్నాయి.


Next Story