కోహ్లీ కెప్టెన్సీపై కొంతమంది సీనియర్ క్రికెటర్లు అసంతృప్తిగా ఉన్నారని.. అంతేకాకుండా సీనియర్ ఆటగాళ్లతో పడకపోవడంతో ఏకంగా ఫిర్యాదు చేశారనే వార్తలు వచ్చాయి.ఇంగ్లండ్ టూర్‌లో ఉండగా సీనియర్ ఆటగాళ్లు అజింక్య రహానే, ఛటేశ్వర్ పుజారాలు కోహ్లీపై ఫిర్యాదు చేశారని, వీరిద్దరూ బీసీసీఐ సెక్రటరీ జైషాకు నేరుగా ఫిర్యాదు చేశారని కథనాలు కొన్ని మీడియా సంస్థలు వండి వార్చాయి. ఏ మాత్రం ఫామ్ లో లేని రహానే, పుజారాలను కోహ్లీ వెనకేసుకువచ్చాడని.. అలాంటి కోహ్లీపై ఎలా ఫిర్యాదు చేస్తారంటూ అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఓటమి తర్వాత సీనియర్ ఆటగాళ్లు ఫిర్యాదు చేశారని వార్తలు వచ్చాయి.
ఈ వార్తలు నిరాధారమని ఒక్క రోజులోనే తేలింది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు. మీడియా ఇలాంటి కథనాలను ప్రచురించడం మానుకోవాలని.. జట్టులో ఏ ఆటగాడూ కోహ్లీపై బీసీసీఐకి ఎటువంటి ఫిర్యాదూ చేయలేదని అరుణ్ స్పష్టంచేశారు. ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే ఆలోచన కోహ్లీ వ్యక్తిగతమైందని, దానిలో బీసీసీఐ పాత్ర ఏమాత్రం లేదని చెప్పారు. ఇప్పుడు సీనియర్ క్రికెటర్లు కోహ్లీపై ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలు కూడా కల్పితాలే అని స్పష్టం చేశారు. కోహ్లీ ఇటీవలే టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్ గా తప్పుకుంటానని వెల్లడించాడు.