సర్ఫరాజ్‌ఖాన్‌ తండ్రికి థార్‌ను ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర

సర్ఫరాజ్‌ ఖాన్ ఆటకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర మంత్రముగ్ధుడు అయ్యారు.

By Srikanth Gundamalla  Published on  16 Feb 2024 4:00 PM IST
anand mahindra, offer, thar,  sarfaraz khan father,

సర్ఫరాజ్‌ఖాన్‌ తండ్రికి థార్‌ను ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్ర

ముంబై క్రికెటర్ సర్ఫరాజ్‌ఖాన్‌ చాన్నాళ్లుగా టీమిండియా తరఫున ఆడాలని ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు అతనికి ఇంగ్లండ్‌ తో భారత్ ఆడుతున్న మూడో టెస్టు ద్వారా అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని అతను బాగా వినియోగించుకున్నాడు. రంజీల్లో టన్నుల కొద్ది పరుగులు చేసిన డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్‌ తొలి టెస్టులోనే అద్బుత ఇన్నింగ్స్‌ను కనబర్చాడు. ఇంగ్లండ్‌తో మూడో టెస్టు భారత్‌ తుది జట్టులో అతనికి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లోనే సర్ఫరాజ్‌ ఖాన్ అర్ధసెంచరీని రాబట్టాడు. అనుకోకుండా జడేజా నుంచి వచ్చిన రాంగ్‌కాల్‌ వల్ల రన్‌అవుట్‌ అయ్యాడు కానీ.. లేదంటే తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ బాదేస్తుండేవాడని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. సర్ఫరాజ్‌ ఖాన్ ఆటకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్ర మంత్రముగ్ధుడు అయ్యారు. ఈ మేరకు అతడి ఆటతీరును ప్రశంసిస్తూ ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టారు. అంతేకాదు.. సర్ఫరాజ్‌ఖాన్‌ను క్రికెటర్‌గా తండ్రి నౌషాద్‌ ఖాన్‌ తీర్చిదిద్దిన తీరును అభినందించారు. నౌషాద్‌ ఖాన్‌కు ఈ మేరకు ఒక గిఫ్ట్‌ ఆఫర్‌ చేశారు.

అవకాశాలు రాలేదని సహనం కోల్పోవద్దనీ.. ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు ఆనంద్ మహీంద్ర. కఠోరశ్రమ, తెగువ, ఓర్పు..ఇవే విజయానికి దారులు అని చెప్పారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేందుకు ఇంతకంటే మెరుగైన లక్షణాలు ఇంకేముంటాయని అన్నారు. తన పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉన్న నౌషాద్‌ఖాన్‌కు థార్‌ వాహనాన్ని కానుకగా ఇద్దామని అనుకుంటున్నట్లు ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. నజరానా అందుకేనేందుకు నౌషాద్‌ ఖాన్ అంగీకరిస్తే సంతోషిస్తామన్నారు. ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తామని ఆనంద్‌ మహీంద్ర ఎక్స్‌లో పోస్టు పెట్టారు.


Next Story