రోహిత్‌ హిస్టరీ.. డబుల్‌ ధమాకా.. టీమిండియా క్లీన్‌స్వీప్

బెంగళూరు లో భారత్, అప్గానిస్థాన్‌ మధ్య చివరి టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ జరిగింది.

By Srikanth Gundamalla  Published on  18 Jan 2024 1:23 AM GMT
afghanistan, t20 series, team india,

రోహిత్‌ హిస్టరీ.. డబుల్‌ ధమాకా.. టీమిండియా క్లీన్‌స్వీప్ 

బెంగళూరు చినస్వామిస్టేడియంలో భారత్, అప్గానిస్థాన్‌ మధ్య చివరి టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ జరిగింది. మూడు టీ20 మ్యాచుల్లో భాగంగా ఉత్కంఠగా సాగిన ఈమ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. రెండు సార్లు మ్యాచ్‌ టై అవ్వడంతో రెండు సార్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. చివరకు రెండో సూపర్ ఓవర్‌లో టీమిండియా 10 పరుగుల తేడాతో గెలిచింది. రెండో సూపర్ ఓవర్లో టీమిండియా 11 పరుగులే చేయగా.. అప్ఘాన్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి ఓటమిపాలైంది. లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ రెండు వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు.

కాగా.. మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది భారత్. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఒకానొక క్రమంలో 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది భారత్. రోహిత్, రింకూ సింగ్ మొదట నిలకడగా ఆడి చివర్లో దంచి కొట్టారు. త ద్వారా రోహిత్‌ శర్మ 121 పరుగులు చేశాడు. కెప్టెన్‌కు తోడు రింకూ కూడా అద్భుతంగా ఆడి 69 పరుగులు చేశాడు. చివరి వరకు నిలబడి నాటౌట్‌గా ఉన్నారు. ఆ తర్వాత అప్ఘాన్ జట్టు కూడా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. దాంతో.. సూపర్‌ ఓవర్‌ నిర్వహించడం అనివార్యమైంది.

తొలి సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ అప్ఘాన్ బ్యాటింగ్ చేసింది. సూపర్‌ ఓవర్‌ను కెప్టెన్ రోహిత్ ముఖేశ్ కుమార్‌కు అప్పగించాడు. ఇన్నింగ్స్‌లో చివరి ఓవర్‌ వేసిన ముఖేశ్ 18 పరుగులు ఇచ్చాడు. అతనికి సూపర్‌ ఓవర్‌ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక సూపర్‌ ఓవర్‌లో ముఖేశ్ బౌలింగ్‌లో అప్ఘాన్ బ్యాటర్లు ఒక వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేశారు. అందులో ఒక సిక్స్.. ఒక ఫోర్‌ ఉన్నాయి. తర్వాత సూపర్‌ ఓవర్‌లో టీమిండియా లక్ష్యం 17 పరుగులు కాగా.. కెప్టెన్ రోహిత్, యశస్వి జైస్వాల్ బరిలోకి వచ్చారు. రోహిత్ మరోసారి విశ్వరూపం చూపించాడు. వరుసగా భారీ సిక్స్‌లు కొట్టాడు. చివరి రెండు బంతుల్లో భారత్‌ గెలుపునకు 3 పరుగులు కావాల్సి వచ్చింది. ఐదో బంతికి సింగిల్ తీసిన రోహిత్ జైస్వాల్‌కు స్రయికింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత తాను రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. రింకూ బ్యాటింగ్‌కు వచ్చాడు. చివరి బంతికి రెండు తీస్తే విజయం. కానీ.. జైస్వాల్ సింగిల్‌ కొట్టడంతో సూపర్ ఓవర్ కూడా డ్రాగా ముగిసింది.

రెండో సూపర్‌ ఓవర్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్‌ రోహిత్‌కు జతగా రింకూ బ్యాటింగ్‌కు వచ్చాడు. తొలి బంతినే రోహిత్‌ సిక్స్‌గా మలిచాడు. ఆ తర్వాత రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. మూడో బంతికి సింగిల్ తీసి రింకూకు స్రయికింగ్ ఇవ్వగా.. అతను నాలుగు బంతికి భారీ షాట్ ఆడబోయి కీపర్ క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ శాంసన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఐదో బంతికి సింగిల్ తీసే యత్నంలో రోహిత్ రన్నౌట్ అయ్యాడు. దాంతో.. సూపర్ ఓవర్‌లో టీమిండియా కథ ముగిసింది. రెండో సూపర్‌ ఓవర్లో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేసింది. 12 పరుగుల లక్ష్యంతో బరిలోకి వచ్చిన అప్ఘాన్‌.. సూపర్‌ ఓవర్లో లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ ధాటికి రాణించలేకపోయింది. తొలి బంతికే నబీని అవుట్‌ చేశాడు. ఆ తర్వాత మూడో బంతికి గుర్బాజ్‌ను అవుట్‌ చేశాడు బిష్ణోయ్. దాంతో.. సూపర్‌ ఓవర్లో అప్ఘన్ జట్టు కేవలం ఒక పరుగు మాత్రమే చేసింది. తద్వారా డబుల్‌ సూపర్‌ ఓవర్ తర్వాత టీమిండియా విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

రోహిత్ శర్మ రికార్డు:

రోహిత్‌ శర్మ ఈమ్యాచ్‌లో అరుదైన ఘనతను సాధించాడు. రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌లో 121 పరుగులు చేసి అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో రోహిత్‌కు ఇది ఐదో సెంచరీ. దాంతో.. వరల్డ్‌లోనే ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్రలో నిలిచాడు. ఐదు సెంచరీలతో మొదటి స్తానంలో రోహిత్ ఉండగా.. 4 సెంచరీలతో తర్వాతి స్థానాల్లో సూర్యకుమార్, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు. ఇక టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ(1643 పరుగులు) నిలిచాడు. తద్వారా విరాట్ కోహ్లీ పేరిట ఉన్న (1570 రన్స్‌) ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు కొట్టాడు.


Next Story