బీజేపీ - శివసేన కూటమి చీలుతుందా..?!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 4:31 PM GMT
బీజేపీ - శివసేన కూటమి చీలుతుందా..?!!

మహారాష్ట్రలో కొత్త పొత్తు పొడుస్తుందా..? బీజేపీ-శివసేన కూటమి చీలిపోతుందా..? ఆగర్భ శత్రువుతో శివసైనికులు చేతులు కలుపుతారా..? ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న పోరాటం ఎటు దారి తీస్తుంది..? .మహారాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవిపై శివసేన పట్టు వీడడం లేదు. సీఎం సీటును వదులుకునే ప్రసక్తే లేదని శివసేన నాయకత్వం తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటేనే బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఇతర ప్రత్యామ్నాయాలున్నాయని, అవసరమైతే ఇతర పార్టీలతో చేతులు కలుపుతామని పేర్కొంది. అన్ని రాజకీయ పక్షాలు తమతో టచ్‌లో ఉన్నాయని వెల్లడించిం ది. ముఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవడంతో పాటు కేబినెట్‌లో సగం బెర్తులు కేటాయించాల్సిందే నని కమలదళానికి అల్టిమేటమ్ జారీ చేసింది.

ముఖ్యమంత్రి పదవిని పంచుకునే ప్రసక్తే లేదని బీజేపీ నాయకత్వం తేల్చి చెప్పిన వేళ, శివసేన నాయకత్వం ముంబైలో సమావేశమైంది. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బీజేపీ ప్రతిపాద నలు, ప్రభుత్వ ఏర్పాటు, పార్టీ వైఖరిపై సుదీర్ఘంగా చర్చించారు. శివసేన శాసనసభాపక్షనేతగా ఏక్‌నాథ్ ను ఎన్నుకున్నారు. చీఫ్ విప్‌గా ఎన్నికయ్యారు. విస్తృత మంతనాల అనంతరం సీఎం సీటుపై వెనక్కి తగ్గొద్దని శివసేన నిర్ణయించింది. మంత్రిపదవుల విషయంలోనూ వెనకడుగు వేయకూడదని తీర్మానించింది.

ఇదిలా ఉంటే, బీజేపీ-శివసేన మధ్య చిచ్చును తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఆ రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచడానికి కొత్త ఎత్తుగడ వేసింది. అవసరమైతే శివసేనకు మద్ధతు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. బీజేపీతో బంధాన్ని తెంచుకొని వస్తే శివసేనతో చేతులు కలపడానికి తమకు అభ్యంతరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఏర్పాటు దిశగా మంతనాలు ముమ్మరం చేసిన కాంగ్రెస్ నాయకులు, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలిశారు. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై చర్చలు జరిపినట్లు సమాచారం.

శివసేన తీరును బీజేపీ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపీలతో జరుగుతున్న తెరచాటు ముచ్చట్లనూ గమనిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవిసే సరైన వ్యక్తి అని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. మొత్తానికి మరాఠా రాజకీయాలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. సుదీర్ఘ బంధాన్ని శివసేన నాయకత్వం తెంచుకుంటుందా? కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం ఆగర్భ శత్రువు కాంగ్రెస్ పార్టీతో శివసేన చేతులు కలుపుతుందా...? అనే చర్చ జరుగుతోంది.

Next Story