పోలీసులను బాగా టెన్షన్ పెడుతోంది ఆ విషయమే..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 April 2020 7:31 AM GMT
పోలీసులను బాగా టెన్షన్ పెడుతోంది ఆ విషయమే..!

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో పోలీసులు దేనికి భయపడుతున్నారో తెలుసా..? కేవలం ఉమ్ముకు మాత్రమే..! పోలీసులు ఎవరైతే కోవిద్-19 పేషెంట్లకు, అనుమానితులను ట్రీట్మెంట్ ఇస్తున్న ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారో.. వాళ్ళకు ఉమ్ము భయం పట్టుకుంది. కోవిద్ అనుమానితులు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తూ ఉండడం వారిని టెన్షన్ పెడుతోంది. ఉమ్ము కారణంగా కూడా కోవిద్-19 వైరస్ సోకుతూ ఉండడంతో పోలీసులు తాము వైరస్ క్యారియర్లు అవుతామేమోనని భయపడుతూ ఉన్నారు.

హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, కింగ్ కోటి ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు మనశ్శాంతి కరువైంది. పాజిటివ్ కేసులను క్వారెంటైన్ లో ఉంచారు.. అనుమానితులను జనరల్ వార్డుల్లో ఉంచారు. జనరల్ వార్డుల్లో ఉన్న వాళ్ళు కిటికీల్లో నుండి ఉమ్మివేస్తూ ఉన్నారు. దీంతో అక్కడి మెడికల్ సిబ్బందికి, పోలీసులకు చాలా భయం పట్టుకుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉండకపోయినా అనుమానితుల్లో చాలా మందికి పాన్, టొబాకో నమిలే అలవాటు ఉండడంతో ఉమ్మివేయడాన్ని వాళ్ళు మానుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అనుమానితులు కిటికీల్లో నుండి ఉమ్మివేస్తూ ఉండడం.. అక్కడ పనిచేస్తున్న వాళ్లకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోందని గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ వ్యక్తి తెలిపారు.

పోయిన వారంతో పోలిస్తే ఈ వారం ఇలాంటి ఘటనలు తగ్గాయని అంటున్నారు. పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది వద్దని వారించినా కొందరు ఇలాంటి పనులు చేయడం మానుకోలేకపోతున్నారు. "తాము మెడికల్ స్టాఫ్ కు ఈ విషయమై సూచనలు ఇచ్చామని.. అలా ఉమ్మివేయడం వలన కలిగే నష్టాల గురించి కూడా చెప్పామని.. ఇంకా మానుకోకపోతే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించామని" ఓ అధికారికి తెలిపారు.

ప్రస్తుతం తాము పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ను వాడుతూ ఉన్నామని.. కానీ కొందరు మూర్ఖంగా ప్రవర్తించడం కారణంగా తమకేమీ కాకూడదని దేవున్ను ప్రార్థిస్తున్నామని అన్నారు. తాము తిరిగి ఇళ్లకు పోవాలంటేనే భయపడుతూ ఉన్నామని.. వైరస్ ను మేము మోసుకుని వెళ్లడం కారణంగా తమ కుటుంబాలను రిస్క్ లో పడవేసిన వాళ్ళము అవుతామని" మరి అధికారి తమ బాధను వ్యక్తం చేశారు. దాదాపు 200 మంది పోలీసులు వివిధ షిఫ్టుల్లో గాంధీ ఆసుపత్రి వద్ద విధులు నిర్వర్తిస్తున్నారు.

గత వారం గాంధీ ఆసుపత్రి వద్ద.. ఉమ్మివేయడం వలన పెద్ద సమస్య తలెత్తిందని.. అనుమానితుల గ్రూపును ఆసుపత్రిలోకి తీసుకుని వచ్చినప్పుడు.. వారంతా విపరీతంగా ఉమ్మివేయడం మొదలుపెట్టారని.. ఆ తర్వాత అధికారులు సూచనలు చేయడంతో పరిస్థితిలో కాస్త మార్పులు వచ్చాయని అన్నారు. చెస్ట్ ఆసుపత్రి లోను, కింగ్ కోటి ఆసుపత్రి లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. పోలీసులు, వైద్యులు అందరూ ప్రజా శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉంటే.. కొందరు మాత్రం కనీసం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. పోలీసులకు, మెడికల్ సిబ్బందికి కూడా కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకుని ప్రవర్తిస్తే బాగుంటుంది.

బుధవారం నాడు తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మివేయడాన్ని బ్యాన్ చేసింది. దీని కారణంగా కోవిద్-19 వైరస్ ను కట్టడి చేయడమే కాకుండా మిగతా ఇన్ఫెక్షన్లను కూడా ప్రబలకుండా ఆపవచ్చని తెలంగాణ ప్రభుతం భావిస్తోంది. ఉమ్మివేసిన వారిపై జరిమానాలు కూడా విధించనున్నారు.

Next Story