86వేల మంది ఉన్న గ్రౌండ్‌లోకి కరోనా బాధితుడు.. అక్కడంతా టెన్షన్.. టెన్షన్
By తోట వంశీ కుమార్ Published on 12 March 2020 5:05 PM ISTకరోనా వైరస్(కొవిడ్-19) పేరు చెబితే చాలు ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే 100కి పైగా దేశాల్లో విజృంభిస్తున్న ఈ మహమ్మారి ధాటికి 3వేల మందికి పైగా మృత్యువాత పడగా.. వేల సంఖ్యలో దీని బాధితులు ఉన్నారు. దీంతో చాలా దేశాలు దాదాపుగా బయటి దేశాల వారిని తమ దేశంలోకి అనుమతించడం లేదు. ఒకే చోట ప్రజలు ఎక్కువ గుమికూడవద్దని ఆదేశాలు సైతం జారీ చేశారు. వైరస్ ధాటికి ఇప్పటికే చాలా క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. మరికొన్ని టోర్నీలను అభిమానులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఓ వార్త ప్రస్తుతం అందరిని ఉలిక్కిపడేలా చేస్తుంది. అదేటంటే.. ఆదివారం మెల్‌బోర్న్ వేదికగా మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో 86,174 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా మహిళల చేతిలో 85 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ను చూడడానికి వచ్చిన వ్యక్తి ప్రస్తుతం కరోనా బారిన పడినట్లు ఆస్ట్రేలియాలోని ఆరోగ్య, మానవ సేవల విభాగం ప్రకటించింది.
ఆ వ్యక్తి నార్త్ స్టాండ్‌లోని లెవల్2లో ఎన్42 సీట్‌లో కూర్చునట్లు ఎంసీజీ(మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్) గుర్తించింది. అయితే, అతని వల్ల స్టేడియంలో మిగతావారికి వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రదేశంలో కూర్చున్న మిగతా ప్రేక్షకులు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని చెబుతున్నారు. కేవలం వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. ఏదైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు అయితే వెంటనే డాక్టర్లను కలవాలని సూచిస్తున్నారు.
ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అంచనా వేసినట్లు ఎవరికీ కరోనా సోకకుంటే ఓకే కానీ.. ఒక వేళ సోకితే.. ఎంతమంది దీని వల్ల ప్రభావితం అవుతారో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.