యూపీఎస్సీ అభ్యర్థులకు ఏపీలో ప్రత్యేక రైళ్లు

By సుభాష్  Published on  30 Sep 2020 3:11 AM GMT
యూపీఎస్సీ అభ్యర్థులకు ఏపీలో ప్రత్యేక రైళ్లు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం ఏపీలో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విజయవాడ డివిజన్‌ పరిధిలో రెండు ప్రత్యేక రైళ్లను పడనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అయితే ఈ పరీక్ష మే 31న జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా ఆ పరీక్షలను అక్టోబర్‌ 4కు వాయిదా వేశారు. దీంతో పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక పరీక్ష రాసే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విశాఖకు ఒక రైలు, విశాఖ నుంచి విజయవాడకు మరో రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

విజయవాడ - విశాఖ

ఈ రైలు అక్టోబర్‌ 3న మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. అదే రోజు అంటే శనివారం రాత్రి 10 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

విశాఖ - విజయవాడ

ఈ రైలు అక్టోబర్‌ 4న ఆదివారం రాత్రి 8.30 గంటలకు విశాఖ స్టేషన్‌ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.

ఈ రెండు ప్రత్యేక రైళ్లు మార్గమధ్యలో ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్‌లలో ఆగుతాయి. దూర ప్రాంతంలో ఉండే అభ్యర్థులు యూపీఎస్సీ పరీక్షకు సకాలంలో హాజరయ్యేందుకు ఈ సదుపాయం కల్పిస్తున్నామని, అభ్యర్థులు ఈ రైలు సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Next Story