జ‌క్క‌న్న అని చెప్పినా.. ద‌ర్శ‌క‌ధీరుడు అని చెప్పినా.. ఠ‌క్కున గుర్తుకువ‌చ్చే పేరు రాజ‌మౌళి. అప‌జ‌యం ఎరుగ‌ని వీరుడులా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ… తెలుగు సినిమా స‌త్తాని మ‌రోసారి ప్ర‌పంచానికి చాటి చెప్పిన గొప్ప ద‌ర్శ‌కుడు. బాహుబ‌లి సినిమాతో బాలీవుడ్ మాత్ర‌మే కాకుండా..హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసిన గొప్ప మేధావి. అందుక‌నే రాజ‌మౌళి గురించి సినీ ప్రియులు ఎక్కువుగా తెలుసుకోవాల‌నుకుంటున్నారు. అందుక‌నే జ‌క్క‌న చెక్కిన చిత్రాలు.. ఆయ‌న గురించి తెలియ‌ని నిజాలు మీ కోసం…

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలు అంటే మ‌క్కువ ఎక్కువ‌. అందుక‌నే గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేయ‌కుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్, క‌జిన్ కీర‌వాణి సినిమా రంగంలో ఉండ‌డంతో ఇంట‌ర్మీడియ‌ట్ కంప్లీట్ అవ‌గానే ఎడిట‌ర్ కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ద్ద అసిస్టెంట్ గా కెరీర్ ను ప్రారంభించారు. విజ‌యం సాధించాలంటే ఓర్పు ఉండి తీరాల్సిందేన‌ని చిన్న వ‌య‌సులోనే ప‌సిగ‌ట్టిన ముందు చూపు ఉన్నోడు. అందుక‌నే సుమారు ఆరేళ్ల పాటు ఏవిఎం రికార్డింగ్ థియేట‌ర్ లో ప‌ని చేయ‌డం.. తండ్రి అడుగు జాడ‌ల్లోనే సినిమా ర‌చ‌న‌కు సంబంధించిన పాఠాలు నేర్చుకోవ‌డం రాజ‌మౌళి విజ‌యాల‌కు ప‌రోక్షంగా కార‌ణాల‌య్యాయి.

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుని అప్ప‌టి తెలుగుదేశం ప్ర‌భుత్వం ఎల‌క్ట్రానిక్ మీడియా అడ్వైజ‌ర్ క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మించిన సంద‌ర్భంలో రాజ‌మౌళి గ‌డించిన అనుభ‌వం విశేష‌మైంది. రాజ‌మౌళిని ఎల‌క్ట్రానిక్ మీడియా అడ్వైజ‌ర్ గా ప్ర‌భుత్వం త‌రుపున నియ‌మించారు. అప్పుడే రాఘేంద్రుడు శాంతి నివాసం సీరియ‌ల్ ప్రొడ్యూస‌ర్ గా మారి రాజ‌మౌళికి డైరెక్ట‌ర్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. అలా అలా బుల్లితెర నుంచి పై పైకి ఎదిగి స్టూడెంట్ నెం. 1 సినిమాతో వెండితెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు.

 

స్టూడెంట్ నెం.1 సినిమా విజ‌యం సాధించ‌గానే.. రాజ‌మౌళితో పాటు జూనీయ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ కూడా మారిపోయింది. ఆత‌ర్వాత జూనీయ‌ర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా తీసి సంచ‌ల‌నం విజ‌యం సాధించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సినీ చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని క‌లెక్ష‌న్లు సాధించ‌డంతో పాటు ఎక్కువ కేంద్రాల్లో సిల్వ‌ర్ జూబ్లీ ఆడిన చిత్రంగా సింహాద్రి చ‌రిత్ర సృష్టించాడు. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ పెర‌గ‌డంతో పాటు రాజ‌మౌళికి డిమాండ్ బాగా పెరిగింది. హీరోలు, నిర్మాత‌లు రాజ‌మౌళితో సినిమా చేసేందుకు క్యూక‌ట్టారు కానీ.. ఆద‌రాబాద‌ర‌గా సినిమాలు తీసి ఎక్కువ సినిమాలు తీశాన‌న్న బిరుదు అక్క‌ర్లేద‌నుకుని..ఏడాదికి ఒక సినిమా తీసినా గొప్ప విజ‌యం సాధించే సినిమా తీయాల‌నుకున్నారు. (ఇంకా ఉంది..)

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.