రాజ‌మౌళి యువ హీరో నితిన్ తో ‘సై’ అనే సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా ద్వారా ర‌గ్బీ అనే ఆట‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసారు. నితిన్ – జెనీలియా జంట‌గా న‌టించిన ఈ విభిన్న క‌థా చిత్రం యూత్ కి బాగా క‌నెక్ట్ అయ్యింది. మంచి విజ‌యాన్ని అందించింది. ఈ సినిమా త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్రం ‘ఛ‌త్ర‌ప‌తి’. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ – రాజమౌళి కాంబినేష‌న్ లో రూపొందిన ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ స్టోరీకి మ‌ద‌ర్ సెంటిమెంట్ ను జోడించారు.

Related image

‘వ‌ర్షం’ త‌ర్వాత విజ‌యం కోసం ఎదురు చూస్తున్న ప్ర‌భాస్ ను స‌రికొత్త‌గా, ప‌వ‌ర్ ఫుల్ రోల్ అద్భుతంగా చూపించి మాస్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో మెప్పించి.. ప్రేక్ష‌క హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర‌వేసారు. ఇక మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో ‘విక్ర‌మార్కుడు’ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో ర‌వితేజ ద్విపాత్రాభినయం చేసారు. అన్యాయాన్ని ఎదురించే ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ విక్ర‌మ్ రాథోడ్ గా, మ‌రో వైపు క‌డుపుబ్బా న‌వ్వించే అత్తిలి స‌త్తిగా ర‌వితేజ‌ను చూపించి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

Related image

రాజ‌మౌళి త‌న ప్ర‌తి సినిమాలో ఏదో కొత్త‌ద‌నం చూపించాల‌ని త‌పిస్తుంటాడు. క‌థ‌, క‌థ‌నంతో పాటు త‌న సినిమాల్లో హీరోలు ఉప‌యోగించే ఆయుధాల‌ను స‌రికొత్త‌గా త‌యారు చేయించ‌డం రాజ‌మౌళి ప్ర‌త్యేక‌త‌. సింహాద్రి, సై, ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు… ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో హీరో ఉప‌యోగించే ఆయుధాలు స‌రికొత్త‌గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే…. రాజ‌మౌళి కొత్త సినిమా వ‌స్తుంది అంటే.. అందులో క‌థానాయ‌కుడు ఉప‌యోగించే ఆయుధం కొత్త‌గా ఎలా ఉంటుందో అని ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు.

Related image

ఇదిలా ఉంటే… ఒక సినిమాని హిట్ చేయాలంటేనే చాలా క‌ష్టం. అలాంటిది అప‌జ‌యం అనేది తెలియ‌కుండా.. వ‌రుస‌గా సినిమాలు ఎలా తీస్తున్నాడు..? రాజ‌మౌళి ద‌గ్గ‌ర ఏదైనా మ్యాజిక్ ఉందా..? ఆ మ్యాజిక్ తో అంద‌ర్నీ మాయ చేసేస్తున్నాడా..? అంటే అదేం లేదు. అత‌నికి సినిమా పై పిచ్చి ప్రేమ ఉంది. ఆ.. పిచ్చి ప్రేమే అత‌నికి విజ‌యాల్ని అందిస్తుంది. తెర పై రెండున్న‌ర గంట‌ల సినిమా చూపించ‌డానికి తెర వెనుక ఎంతో శ్ర‌మిస్తాడు. అయితే… సినిమాని ఇంత‌గా ప్రేమించే రాజ‌మౌళిని ఓ సినిమా బాగా ప్ర‌భావితం చేసింది. ఇంత‌కీ.. ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా…?

(ఇంకా ఉంది..)

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.