లాక్‌డౌన్: ఇక ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ప్రయాణికులకు పాసుల జారీ..!
By సుభాష్ Published on 13 April 2020 3:22 PM GMTదేశ వ్యాప్తంగా కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక లాక్‌డౌన్ ఉండటంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా తమ తమ ఇళ్లల్లోనే ఉంటూ ఎటు వెళ్లలేని పరిస్థితి. ఏదైనా అత్యవసరం ఉన్నా.. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసుల చర్యలతో కేసుల నమోదు, వాహనాల సీజ్ వంటివి భయపెడుతున్నాయి. ఇక స్వచ్చంధంగా సేవా చేసేవారికి, ప్రభుత్వ విధులు నిర్వహించేవారు, అత్యవసర పనిమీద వెళ్లాలనుకునే వారికి ఇబ్బందిగానే మారింది. ఈ ఇబ్బదులను గుర్తించిన ఏపీ సర్కార్ అటువంటి వారికి బయటకు వెళ్లే వారి కోసం సరికొత్త నిర్ణయం తీసుకుంది.
అత్యవసర సేవలకు, అత్యవసర ప్రయాణాలు చేసేవారికి కోవిడ్-19 అత్యవసర రవాణా పాసులను జారీ చేయనున్నట్లు డీజీజీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం ఒక ప్రకటన విడుదలైంది.
పాసులు ఎలా పొందాలి..?
ఇక అత్యవసర రవాణా కోసం పాసులు అందజేస్తున్న నేపథ్యంలో పాసులు పొందాలంటే కొన్ని నిబంధనలు విధించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జారీ చేయనున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. పాసులు కావాలనుకునే వారు అత్యవసరమైన కారణాలను చూపి పాసులు పొందవచ్చని తెలిపింది ప్రభుత్వం.
అయితే పాసులు పొందాలనుకునే వారు పేరు, పూర్తి చిరునామా, ఆధార్ కార్డు వివరాలు, ప్రయాణించే వాహనం నెంబర్, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు, ఎంత మంది ప్రయాణించనున్నారు.. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్లనున్నారు.. ఇలా అన్ని పూర్తి వివరాలు అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. మీరు వివరాలతో కూడిన పత్రాలను పరిశీలించి పాసులను జారీ చేస్తారు. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం అంతే సంగతి. కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ కార్యాలయం హెచ్చరించింది.
పాసుల కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
అత్యవసర పాసులు పొందాలనుకునేవారు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధించి వివరాలతో ఆయా జిల్లా ఎస్సీల వాట్సాప్ నెంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలన్ని పరిశీంచిన తర్వాత సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్‌కు, మెయిల్ ఐడీకి పాస్‌ను పంపిస్తారు.
వీటి నుంచి వచ్చిన అనుమతులే చెల్లుబాటు
ఇక జిల్లా ఎస్పీ వాట్సాప్ నెంబర్, మెయిల్ ఐడీ నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే చెల్లుబాటు అవుతాయని డీజీపీ కార్యాలయం పేర్కొంది. ఫార్వార్డ్ చేసిన పాసులు ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కావు. కాగా, ప్రయాణం చేసేటప్పుడు మాత్రం గుర్తింపు కార్డు వెంట తప్పని సరిగా ఉండాల్సి ఉంటుందని సూచించింది.