లాక్‌డౌన్‌ వేళ.. బంగారం ధర రికార్డు

By సుభాష్  Published on  13 April 2020 2:12 PM GMT
లాక్‌డౌన్‌ వేళ.. బంగారం ధర రికార్డు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కారణంగా అతలాకుతలం అవుతోంది. కరోనా వల్ల మార్కెట్‌ రంగానికి భారీ దెబ్బ తగిలింది. మార్కెట్‌ రంగాలు సైతం కుదేలవుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంలోనూ బంగారానికి రెక్కలొచ్చాయి. మొన్నటి వరకూ నేల చూపులు చూసిన పసిడి ధర.. తాజాగా రికార్డు స్థాయికి చేరింది.

లాక్‌డౌన్‌ కారణంగా బంగారం షాపుల్లో కొనుగోళ్లు జరగనప్పటికీ ధర మాత్రం పెరిగిపోతోంది. ఆదివారం క్లోజింగ్‌ సమయంలో 10 గ్రాముల బంగారం ధర రూ.45వేల 294 ఉండగా, సోమవారం మాత్రం రూ. 45వేల 950కి చేరుకుంది.

కాగా, లాక్‌డౌన్‌ కారణంగా దేశీయంగా చూస్తే బంగారానికి అంతగా డిమాండ్‌ లేకున్నా.. అంతర్జాతీయంగా ధరలు పెరగడం మూలంగా పరుగులు పెడుతున్నట్లు మార్కెట్‌ నిపుణలు చెబుతున్నారు. గడిచిన కొన్ని గంటల్లోనే 1.46శాతం పెరుగుదల నమోదైంది. అయితే దేశంలో బంగారం ధరను ఎగుమతి సుంకం 12.5 శాతం, వస్తు సేవల పన్ను (జీఎస్టీతో)కలిపి 3శాతం నిర్ణయిస్తారు. ఇది వరకు లాక్‌డౌన్‌ సమయంలోనూ పసిడి ధర భారీగానే తగ్గినా.. ప్రస్తుతం పరుగులు పెడుతోంది. ఇక వెండి ధర కూడా అదే బాటలో వెళ్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 42వేల 500లకు చేరింది.

భారత్‌లో గత మూడు వారాలుగా బంగారం కొనుగోళ్లు సైతం నిలిచిపోయాయి. అంతేకాదు లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఉండటంతో జ్యువెలర్స్‌ మే డెలివరీకి కూడా ఆర్డర్లు ఇవ్వడం లేదని ముంబైకి చెందిన డీలర్స్‌ చెబుతున్నారు.

Next Story
Share it