చంద్రబాబు ప్రభుత్వంలో అవకతవ‌కలపై సిట్ వేసిన జగన్ సర్కార్..!

By సుభాష్  Published on  21 Feb 2020 5:55 PM GMT
చంద్రబాబు ప్రభుత్వంలో అవకతవ‌కలపై సిట్ వేసిన జగన్ సర్కార్..!

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌ల వ్య‌వ‌హారాలను వెలికి తీసేందుకు దూకుడు పెంచింది. రాజ‌ధాని భూములు, అవినీతి ఆరోప‌ణ‌ల‌పై కేబినెట్ స‌బ్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌పై విచార‌ణ‌కు ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఐపీఎస్ అధికారి కొల్లి ర‌ఘురామ్ రెడ్డి నేతృత్వంలో 10 మందితో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ బృందంలో విశాఖ ఎస్పీ అట్టాడ బాపూజీ, ఇంట‌లిజెన్స్ ఎస్పీ వెంక‌ట అప్ప‌ల‌నాయుడుతో పాటు అద‌న‌పు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు క‌లిపి మొత్తం ప‌ది మంది ఈ క‌మిటీలో ఉండ‌నున్నారు.

ఈ బృందం గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన రాజ‌ధాని భూములు, అవినీతి ఆరోప‌ణ‌ల‌పై లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నుంది. కాగా, రాజ‌ధాని వ్య‌వ‌హారాల్లో చోటు చేసుకున్న ఆర్థిక‌, న్యాయ‌ప‌ర‌మైన అక్ర‌మాల‌పై సిట్ విచార‌ణ జ‌ర‌ప‌నుంది.

కాగా, అమ‌రావ‌తిలో చోటు చేసుకున్న ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్, భూముల లావాదేవీల‌పై కూడా విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

టీడీపీ నేత‌లు ఆక్ర‌మించిన భూముల‌ను రాజ‌ధాని ప‌రిధిలోకి తెస్తూ..

అలాగే టీడీపీ నేత‌లు ఆక్ర‌మించిన భూముల‌ను రాజ‌ధాని ప‌రిధిలోకి తీసుకువ‌స్తూ.. చేసిన అక్ర‌మాల‌పై కూడా సిట్ విచార‌ణ జ‌ర‌పనున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి వ‌ర్గ ఉప సంఘం నివేదిక‌ను విచారించి, త‌ర్వాత క్రిమిన‌ల్ కేసులు పెట్టే అధికారం ఈ సిట్ బృందానికి అప్ప‌గించింది ఏపీ స‌ర్కార్‌. అవ‌స‌ర‌మైతే కేంద్ర‌, రాష్ట్ర ప‌రిధిలోని ఇత‌ర విచార‌ణ సంస్థ‌ల సహాయం తీసుకునే అవ‌కాశాలు క‌ల్పించింది.

స్పీక‌ర్ ఆదేశాల మేర‌కు విచార‌ణ‌

కాగా, రాజ‌ధానిలో జ‌రిగిన భూముల అవ‌క‌త‌వ‌క‌ల‌పై లోతుగా విచార‌ణ చేప‌ట్టాల‌ని కోరుతూ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ఆదేశాల మేర‌కు విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

Next Story