మొట్టమొదటి స్పేస్ కుక్కీస్

By రాణి  Published on  24 Jan 2020 9:21 AM GMT
మొట్టమొదటి స్పేస్ కుక్కీస్

ముఖ్యాంశాలు

  • మొదటిసారిగా స్పేస్ లో కుకీస్ తయారీ
  • స్పేస్ సెంటర్ లో ఓవెన్ సాయంతో కుక్కీస్ తయారీ
  • దాదాపు రెండు గంటలకు పైగా పట్టిన సమయం
  • భూమ్మీదైతే కేవలం 20 ని.లలో కుక్కీస్ తయారీ
  • ఇందుకోసం ప్రత్యేకంగా ఎలక్రిక్ ఓవెన్ తయారీ
  • గడిచిన నవంబర్ నెలలో స్పేస్ సెంటర్ లో ప్రారంభం
  • కుక్కీస్ తయారుచేసి రికార్డ్ సాధించిన ఆస్ట్రొనాట్స్

ఆకాశంలో పెళ్లిళ్లు చేసుకునేవాళ్లనీ చూసుంటారు. పారాచూట్లతో రకరకాలుగా గిరికీలు కొడుతూ నేలమీదికి దిగొచ్చే సాహసవీరుల్నీ చూసుంటారు. సొంత విమానాల్లో గగన విహారం చేస్తూ రకరకాల రికార్డుల్ని నెలకొల్పేవాళ్లను, బద్దలుకొట్టేవాళ్లనూ చూసుంటారు. కానీ అంతరిక్షంలో అద్భుతంగా వంట చేసే వాళ్లను ఎప్పుడైనా చూశారా.. వాళ్ల గురించి కనీసం విన్నారా.. ఇదిగో మీకు మేం అలాంటి అద్భుతమైన విషయాన్ని గురించే చెప్పబోతున్నాం..

ఆకాశంలో విమానంలో ఎగురుతూ కుక్కీస్ తినడం మనలో చాలామందికేం కొత్తకాదు. కానీ అంతరిక్షంలో కుక్కీస్ తినడం అంటే, అదీ అక్కడే తయారుచేసుకునిమరీ తినడమంటే విచిత్రమేకదా! అసాధ్యమైన ఆ పనిని సుసాధ్యం చేసిచూపించారు ఆస్ట్రోనాట్స్ క్రిస్టినా కౌచ్, లూకా పార్మిటనో. భూమ్మీద కుక్కీస్ తయారుచేసుకోవడానికి రమారమి ఇరవై నిమిషాల సమయం పట్టొచ్చు. కానీ స్పేస్ సెంటర్ లో కుక్కీస్ వండుకోవడానికి దాదాపుగా రెండు గంటలకు మించి సమయం పట్టింది. పైగా అసలు అలా అక్కడ వండిన కుక్కీస్ రుచి ఎలా ఉందోకూడా ఎవరికీ తెలీదు.

ఇండివిడ్యువల్ బేకింగ్ పౌచెస్ లో ముడి కుక్కీస్ ని స్పేస్ ఫ్లైట్ కంటెయినర్ లో గట్టిగా ప్యాక్ చేసి గడ్డగట్టిన స్థితిలో రెండు వారాలక్రితం స్పేస్ ఎక్స్ కాప్సూల్ లో అంతరిక్షకేంద్రానికి పంపించారు. ఇవే అంతరిక్షంలో ఓపికగా వండిన మొట్టమొదటి వంటకంగా చరిత్రలో రికార్డును నమోదు చేశాయి. జాన్ సన్ స్పేస్ సెంటర్ లో ఉన్న నానోరాక్స్ ఇందుకోసం ప్రత్యేకంగా ఓ చిన్న ఎలక్ట్రిక్ మైక్రో ఓవెన్ ని తయారు చేసి అంతరిక్షకేంద్రానికి పంపించింది. గడచిన నవంబర్ నెలలో ఇది అంతరిక్ష కేంద్రానికి చేరింది. అంతరిక్ష కేంద్రంలో ఫ్రీజ్ చేసిన ఐదు రా కుక్కీస్ ఆల్రెడీ తయారుగా ఉన్నాయ్.

ఇంకేం ఆస్ట్రోనాట్స్ వంటకు సంబంధించిన ప్రయోగాలు మొదలుపెట్టేశారు. దాదాపుగా ఈ కుక్కీస్ ని వండుకోవడానికి వాళ్లకు రెండు గంటలకు పైగా సమయం పట్టింది. మొదటి కుక్కీని ఓవెన్ లో పెట్టినప్పుడు చాలా ఎక్కువ సమయం తీసుకుంది. కానీ పెద్దగా ఫలితం కనిపించలేదు. రెండు, మూడు బిస్కట్లు మాత్రం కొద్దిగా ఉడికినట్టుగానే అనిపించాయి. కానీ నాలుగో కుక్కీ మాత్రం బ్రౌన్ కలర్ లోకి మారి అచ్చమైన, అసలు సిసలైన కుక్కీగా మారిపోయింది. నిజానికి ఈ కుక్కీలు నిజంగా పూర్తిగా ఉడికాయా అంటే మాత్రం చెప్పడం చాలా కష్టమేనని కానీ బేకింగ్ పిండిలా మాత్రం లేవనీ ఆస్ట్రొనాట్స్ అంటున్నారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా తొలిసారి స్పేస్ లో వండిన ఈ కుక్కీస్ కంటికి ఇంపైన బిస్కెట్లుగా చరిత్రలో శాశ్వతంగా నిలిపోయాయి.

Next Story