అత్యంత విషమంగా ఎస్పీ బాలు ఆరోగ్యం
By తోట వంశీ కుమార్ Published on 24 Sep 2020 1:39 PM GMTగానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇటీవల కరోనా బారిన పడిన.. ఆయన కోలుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీ బాలు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఎంజీఎం ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. గత 24గంటల్లో ఎస్పీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని వెల్లడించింది. ఎక్మో, వెంటిలేటర్, ఇతర ప్రాణాధార ఆధారంగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గత 40 రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే.. అభిమానులను తాజా వార్త కలవర పెడుతోంది. మళ్లీ అనారోగ్యం తిరగగెట్టడంతో బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో పాటు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు 5నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. రోజూ ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తున్నారు. అదేవిధంగా రోజూ తండ్రి ఆరోగ్య పరిస్థితి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా వేదికగా వివరిస్తున్నారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.