బెంగళూరు నగరంలో ఓ ఫార్మసీ కౌంటర్‌లో కొనుగోలు చేసిన అబార్షన్ మాత్రను తీసుకోవడంతో 33 ఏళ్ల మహిళ సమస్యలతో మరణించిందని పోలీసులు బుధవారం తెలిపారు. మృతురాలు ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రీతి కుష్వాగా గుర్తించారు. ఆమెకు 11 నెలల పాప ఉంది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబరు 10న వైద్యపరీక్షల సమయంలో దంపతులకు గర్భం గురించి తెలిసింది. మొదటి బిడ్డ ఇంకా శిశువుగా ఉన్నందున, గర్భంతో కొనసాగకూడదని మహిళ నిర్ణయించుకుంది.
ఆ తర్వాత అబార్షన్ మాత్రలు కావాలని భర్తను కోరగా అతడు నిరాకరించాడు. సోమవారం రాత్రి అతను వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ప్రీతి మాత్ర తీసుకుని వాటర్ తాగింది. ఆ తరువాత ఆమెకు తీవ్రమైన రక్తస్రావం అయ్యింది. భరించలేని నొప్పితో భర్తకు ఫిర్యాదు చేసింది. ఆమె భర్త ఆసుపత్రికి వెళ్లాలని పట్టుబట్టినప్పటికీ ఆమె నిరాకరించింది. మంగళవారం ఆమె అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. ఆమె భర్త, సోదరుడు ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.
ప్రాథమిక విచారణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని పోలీసులు తెలిపారు. ప్రీతి అబార్షన్ మాత్రలు సేవించడం వల్లే చనిపోయిందని మృతురాలి సోదరుడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.