ఓ డాక్టర్ చేసిన నిర్లక్ష్యపు పని వల్ల ఓ శిశువు ప్రాణం బలైంది. ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరిన మహిళకు తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా.. పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. డ్యూటీలో డాక్టర్ లేకపోవడంతో.. నర్సులే గర్భిణీకి డెలివరీ చేశారు. ఆపరేషన్ మధ్యలో విపత్కర పరిస్థితులు ఎదురుయ్యాయి. దీంతో నర్సులు వైద్యుడిని వీడియో కాల్ ద్వారా సంప్రదించారు. దీంతో డాక్టర్ వీడియో కాల్ ద్వారా పలు సూచనలు చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని చెంగల్పుట్టు సునంబేడు గవర్నమెంట్ ఆస్పత్రిలో జరిగింది.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం (సెప్టెంబర్ 19న) పుష్ప(33) బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు రావడంతో పుష్ప తన భర్త మురళితో కలిసి సునంబేడు గవర్నమెంట్ ఆస్పత్రిలో చేరింది. కానీ, అక్కడ నర్సులు తప్ప డాక్టర్ లేడు. అంతకుముందు ఆస్పత్రికి వచ్చినప్పుడు నిర్వహించిన పరీక్షల్లో పుష్పకు పలు సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రసవం సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పారు.
ఇవేవీ తెలుసుకోకుండా నర్సులు గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడే వారికి సమస్య ఎదురైంది. ప్రసవం చేస్తుండగా శిశువు కాళ్లు బయటకు రావడాన్ని నర్సులు గమనించారు. దీంతో గర్భంలో శిశువు అడ్డం తిరిగినట్లు నిర్ధరణకు వచ్చి వెంటనే డాక్టర్‌కి కాల్ చేశారు. అయితే డాక్టర్ వీడియో కాల్ ద్వారా పలు సూచనలు చేసినప్పటికీ నర్సులు శిశువు తలను బయటకు తీయలేకపోయారు. దీంతో పుష్పను మదురంతగమ్ జీహెచ్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అంబులెన్స్‌లో వెళ్తుండగా శిశువు తల బయటకు వచ్చింది. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత శిశువు చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.
ఈ విషయం సునంబేడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెద్దఎత్తున స్థానికులు ఆస్పత్రి వద్దకు వచ్చి నిరసనకు చేపట్టారు. వైద్యుడు, నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు, వైద్యాధికారులు రంగంలోకి దిగారు. వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. ఘటనకు కారకులైన వారిపై తగిని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.