రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అంశంపై సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని చెప్పారు. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవితో సోమవారం రాజకీయాలపై చర్చించినట్లు నటుడు రజనీకాంత్ తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు గవర్నర్‌తో రజనీకాంత్ భేటీ జరిగింది. ఆ తర్వాత రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. ''రాజకీయాలపై చర్చించాం. దాంతో పాటు ఇంకా మేం ఏం చర్చించుకున్నామో నేను చెప్పలేను. ఇది మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమే'' అని ఆయన అన్నారు.
ఎక్కువ కాలం ఉత్తరాదిలోనే గడిపిన గవర్నర్ రవికి తమిళనాడు రాష్ట్రం అంటే చాలా ఇష్టమని రజనీకాంత్ చెప్పారు. తమిళుల కష్టాన్ని, నిజాయితీని గవర్నర్ ఇష్టపడతారని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా, ఇక్కడి ఆధ్యాత్మికత అంటే ఆయనకు ఎంతో ఇష్టమన్నారు. తమిళనాడు సంక్షేమం కోసం ఏదైనా చేయడానికి సిద్ధమని రవి తనతో చెప్పారని రజనీకాంత్ స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలపై చర్చించారా అనే ప్రశ్నకు రజనీ సమాధానమిస్తూ.. "దాని గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను" అని అన్నారు.
పెరుగు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులపై జీఎస్టీ వేయడంపై ఓ విలేఖరి ప్రశ్న అడగగా, జిఎస్‌టిపై వ్యాఖ్యానించడానికి రజనీ నిరాకరించారు. అలాగే తన కొత్త చిత్రం "జైలర్" షూటింగ్ ఆగస్ట్ 15 లేదా ఆగస్టు 25న ప్రారంభమవుతుంది చెప్పారు. రాజకీయ పార్టీని స్థాపించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని 2017లో రజనీకాంత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ 2020, డిసెంబర్‌లో సూపర్‌స్టార్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.