ఆలస్యంగా గుర్తిస్తుండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తోన్న ప్రోస్టేట్ క్యాన్సర్

ఈ క్యాన్సర్ కేసులు సంఖ్య పెరగటానికి మారిన జీవనశైలితో పాటుగా వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 7 April 2026 10:35 PM IST

ఆలస్యంగా గుర్తిస్తుండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తోన్న ప్రోస్టేట్ క్యాన్సర్

హైదరాబాద్‌లో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను గుర్తించడం... ఆ ముప్పుకు తగినట్లుగా సిద్ధమవడంలో అంతరం పెరుగుతోంది. ఈ ఆలస్యం వల్ల కలిగే నష్టాన్ని ఇప్పుడు గణాంకాలే ప్రతిబింబిస్తున్నాయి. నిమ్స్ (NIMS) గణాంకాల ప్రకారం, నగరంలో పురుషులలో కనిపిస్తోన్న అన్ని రకాల క్యాన్సర్లలో ప్రోస్టేట్ క్యాన్సర్ వాటా ఇప్పటికే దాదాపు 6.9 శాతంగా ఉంది. తెలంగాణలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులను విస్తృత స్థాయిలో చూస్తే, 2026 లో కేవలం పురుషులలో 21,252 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతాయని అంచనా. మొత్తం మీద చూస్తే, రాష్ట్రవ్యాప్తంగా స్త్రీ పురుషులలో నమోదుకాబోయే క్యాన్సర్ కేసుల సంఖ్య 46,762గా ఉండవచ్చని అంచనా. ఇంత తీవ్రత ఉన్నప్పటికీ, క్యాన్సర్ స్క్రీనింగ్ రేట్ ప్రమాదకర స్థాయిలో 4 శాతం కంటే తక్కువగా వుంది. పెరుగుతున్న క్యాన్సర్ కేసుల సంఖ్యకు, ముందస్తుగా గుర్తించడంలో ఉన్న పరిమితులకు మధ్య ఉన్న ఈ అసమతుల్యత కారణంగా, చాలా కేసులు వ్యాధి ముదిరిన దశలో నిర్ధారణ అవుతున్నాయి. ఈ దశలలో వచ్చిన రోగులకు చికిత్స ఫలితాలు చాలా అధ్వాన్నంగా ఉంటాయి.

ఈ క్యాన్సర్ కేసులు సంఖ్య పెరగటానికి మారిన జీవనశైలితో పాటుగా వ్యవస్థాగత కారణాలు కూడా ఉన్నాయి. కొవ్వు అధికంగా ఉండే, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం పెరగడం; ఊబకాయం, మధుమేహం, ధూమపానం పెరగటం; కూరగాయల వినియోగం తగ్గడం వంటివి ఈ భారం పెరగడానికి ముఖ్య కారణాలు. అదే సమయంలో, తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి రావటం, మూత్ర ప్రవాహం బలహీనమైన రీతిలో ఉండటం లేదా పెల్విక్ అసౌకర్యం వంటి ప్రోస్టేట్ క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణాలు తరచుగా విస్మరించబడుతున్నాయి లేదా వయసుతో పాటుగా వచ్చే సమస్యలుగా పొరపాటు పడుతుంటారు. ఈ కారణాలు, వైద్య సహాయం ఆలస్యం కావడానికి దారితీస్తుంది, ఫలితంగా చాలా మంది రోగులు క్యాన్సర్ 4వ దశలో వైద్యులను సంప్రదిస్తున్నారు. దీని ప్రభావం చికిత్స ఫలితాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది, దేశవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముదిరిన కేసులలో దాదాపు 65 శాతం మృత్యువాత పడుతున్నారు. హైదరాబాద్‌లో 0 నుండి 74 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే ముప్పు, ప్రస్తుతం ప్రతి 8 మందిలో ఒకరికి ఉంటుందని అంచనా వేయబడింది. ఇది ముందుగా క్యాన్సర్ ను గుర్తించే మార్గాలను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను మరింతగా నొక్కి చెబుతోంది.

"ప్రోస్టేట్ క్యాన్సర్ దాని ప్రారంభ దశలో ఎల్లప్పుడూ తీవ్రంగా ఉండదు, అంటే అది ప్రాణాంతకంగా మారకముందే దానిని గుర్తించడానికి స్పష్టమైన అవకాశం ఉంది," అని జూబ్లీ హిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీ లో మెడికల్ ఆంకాలజీ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సురేష్ ఘడ్యాల్‌పాటిల్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ “ దానికి బదులుగా, మనం చూస్తున్నది చికిత్స తీసుకోవడంలో ఆలస్యం కావడమనే ధోరణిని ! లక్షణాలను తరచుగా విస్మరిస్తున్నారు. పరీక్షలు చేయించుకోవడం అనేది సాధారణ ఆరోగ్య ప్రవర్తనలో ఒక భాగంగా చూడటం లేదు. సమస్య తీవ్రమై, రోగులు హాస్పిటల్ కు వచ్చేసరికి, వ్యాధి ముదిరిపోతోంది. చికిత్సను మరింత క్లిష్టతరం చేసే , ఫలితాలు అంత అనుకూలంగా లేని దశలో వీరు వస్తున్నారు. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన పురుషులు లేదా ప్రమాద కారకాలు కలిగిన వారి విషయంలో, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం దిశగా తీసుకునే ఒక చిన్న ఆలోచన, ఈ గతిని గణనీయంగా మార్చగలదు..." అని ఆయన అన్నారు.

శస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ మరియు ఖచ్చితమైన చికిత్సా విధానాలు సహా చికిత్సలలో పురోగతి మనుగడ అవకాశాలను మెరుగుపరుస్తున్నప్పటికీ, వ్యాధిని చివరి దశలో గుర్తించడాన్ని తగ్గించడంలోనే అసలైన అవకాశం ఉంది. 2026 నాటికి భారతదేశంలో మొత్తం క్యాన్సర్ మరణాలు దాదాపు 7,05,000కు చేరుకుంటాయని అంచనా వేయగా, రాబోయే దశాబ్దాలలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, హైదరాబాద్ ప్రస్తుత గమనం ఒక విస్తృత జాతీయ సవాలును ప్రతిబింబిస్తోంది. ఈ అంతరాన్ని పూడ్చడం అనేది కొత్త వైద్య ఆవిష్కరణలపై తక్కువగానూ, ప్రోస్టేట్ స్క్రీనింగ్‌ను సాధారణ ఆరోగ్య పరీక్షలలో చేర్చడం, ముందుగానే సంభాషణలను ప్రోత్సహించడం, తేలికపాటి లక్షణాలను విస్మరించాల్సిన సంకేతాలుగా కాకుండా ప్రారంభ సూచనలుగా పరిగణించి చికిత్స అందించడంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

Next Story