ట్రాఫిక్ చలాన్ల చెల్లింపుపై 50 శాతం డిస్కౌంట్.. ఫిబ్రవరి 11 వరకు ఆఫర్
Pay traffic fines with 50 per cent discount before Feb 11. ట్రాఫిక్ జరిమానాలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి
ట్రాఫిక్ జరిమానాలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నందున కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్లు చెల్లించేవారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర రవాణా శాఖ ఫిబ్రవరి 11 లోపు జరిమానాలు చెల్లించే వారికి 50 శాతం తగ్గింపును అందించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ గురువారం రాష్ట్రవ్యాప్త ఉత్తర్వులను ఆమోదించింది. జనవరి 27న సీనియర్ హైకోర్టు న్యాయమూర్తి, కర్ణాటక రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ బి. వీరప్ప అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని తరువాత రవాణా శాఖ ఫిబ్రవరి 2 న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. చెల్లించాల్సిన జరిమానాలపై “వన్-టైమ్ రాయితీ” ప్రకటించింది. ఫిబ్రవరి 11లోపు రాష్ట్రవ్యాప్తంగా పరిష్కారమైన ట్రాఫిక్ చలాన్లపై ఈ రాయితీ వర్తిస్తుంది.
రాష్ట్రంలోని కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి సుమారు రూ. 1,003 కోట్ల జరిమానాలు ఉండగా, అందులో 80 శాతం కేసులు బెంగళూరు కమీషనరేట్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. జూన్ 2022లో జరిగిన లోక్ అదాలత్‌లో ట్రాఫిక్ కేసుల్లో 2.23 లక్షల వ్యాజ్యాలు పరిష్కరించబడ్డాయి. రూ. 22.36 కోట్ల జరిమానాలు వసూలు చేయబడ్డాయి. అదేవిధంగా, 2022 నవంబర్ నెలలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో 4.18 లక్షల కేసులు పరిష్కరించబడ్డాయి. రూ. 23.89 కోట్ల జరిమానా వసూలు చేయబడింది.
జనవరి 30న, రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ మొబైల్ ఈ-చలాన్‌లో నమోదు చేసిన జరిమానా మొత్తంపై 50% తగ్గింపు ఇవ్వాలని రవాణా కమిషనర్ ప్రభుత్వానికి ప్రతిపాదనను సమర్పించారు. ఈ ప్రతిపాదనకు ఆర్థిక శాఖ అంగీకరించింది. ట్రాఫిక్ ఇ-చలాన్ కేసుల్లో జరిమానాలు వసూలు చేసేటప్పుడు రాయితీలు ఇవ్వాలని న్యాయవాదులు, ప్రజలతో సహా సమాజంలోని వివిధ వర్గాల నుండి అభ్యర్థనలు వచ్చాయి. అన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలకు తగ్గింపు వర్తిస్తుంది. జరిమానాలను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని చెబుతున్నప్పటికీ, ఆఫ్‌లైన్ చెల్లింపులు చేయవచ్చా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.