బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నాగవార ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న పిల్లర్ మంగళవారం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మహిళ, ఆమె పసిబిడ్డ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్‌బీఆర్ లేఅవుట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఉదయం 11 గంటల ప్రాంతంలో పిల్లర్ నిర్మాణం కోసం వేసిన టీఎంటీ బార్‌లు తల్లీకొడుకు ప్రయాణిస్తున్న స్కూటర్‌పై పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పిల్లర్ ఎత్తు 40 అడుగుల కంటే ఎక్కువ, అనేక టన్నుల బరువు ఉంటుంది.
చుట్టుపక్కలవారు వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మహిళ, ఆమె రెండున్నరేళ్ల కుమారుడు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనలో ఆమె భర్త, మరో చిన్నారికి గాయాలయ్యాయి. ''ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. మేం వారిని రక్షించడానికి చాలా ప్రయత్నించాం. అప్పటికే చాలా రక్తం పోయింది. బీపీ కూడా పడిపోయింది'' అని చికిత్స చేసిన వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగినప్పుడు చాలా వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, ఈ ఘటనతో ఆ మార్గంలో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ధార్వాడలో విలేఖరులతో మాట్లాడిన సీఎం బసవరాజ్ బొమ్మై.. ఘటనపై విచారణ జరిపి మృతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.