హృద్రోగుల్లో అత్యధిక శాతం మంది 50 ఏళ్ల లోపువారే.. టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

భారతదేశపు దిగ్గజ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దేశవ్యాప్తంగా 300 మంది కార్డియాలజిస్టులతో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాలను ప్రకటించింది.

By -  న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 13 Oct 2025 5:00 PM IST

హృద్రోగుల్లో అత్యధిక శాతం మంది 50 ఏళ్ల లోపువారే.. టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

భారతదేశపు దిగ్గజ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థల్లో ఒకటైన టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, దేశవ్యాప్తంగా 300 మంది కార్డియాలజిస్టులతో నిర్వహించిన సర్వేలో వెల్లడైన విషయాలను ప్రకటించింది. దీని ప్రకారం యువ భారతీయుల్లో గుండెకు సంబంధించిన తీవ్ర సమస్యలు, ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. ప్రారంభ దశలో హెచ్చరిక సంకేతాలపై చాలా మందికి అవగాహన లేకపోవడం, ఆర్థిక సన్నద్ధత లేకపోవడం మరింత సమస్యాత్మకంగా ఉంటోంది.

గత దశాబ్దకాలంగా గుండె సంరక్షణ విషయంలో నాటకీయ పరివర్తన చోటు చేసుకున్నట్లు సర్వే పేర్కొంది. హృద్రోగాలు యువ భారతీయుల్లో అత్యధికంగా పెరుగుతున్న తీరును ఈ అధ్యయనం తెలియజేసింది. తమ దగ్గరకొచ్చే పేషంట్లలో అత్యధిక శాతం మంది 50 ఏళ్ల లోపువారే ఉంటున్నారని 74 శాతం మంది డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గరకొచ్చే కార్డియాక్ పేషంట్లలో 31-40 వయస్సు వారు ఎక్కువగా ఉంటున్నారని 36 శాతం మంది డాక్టర్లు, 41-50 ఏళ్ల గ్రూప్‌లోని వారు ఎక్కువగా ఉంటున్నారని 38 శాతం మంది డాక్టర్లు వెల్లడించారు. దశాబ్దం క్రితం 87 కేసుల్లో ప్రభావిత పేషంట్ల వయో గ్రూప్ 41 ఏళ్లకు పైగా ఉండేది.

“భారతదేశపు కార్డియాక్ సవాళ్లనేవి ఇటు వైద్యం అటు ఆర్థికపరమైనవిగా ఉంటున్నాయని గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. యువ జనాభాలో హృద్రోగ సమస్యలు పెరుగుతుండటమనేది చాలా మటుకు కుటుంబాలకు భావోద్వేగాలపరంగాను, ఆర్థికంగాను అనూహ్యమైనదిగా ఉంటుంది. గత అయిదేళ్లుగా కార్డియాలజీ చికిత్స వ్యయాలు దాదాపు 65 శాతం పెరిగాయి. ప్రివెంటివ్ కేర్ మాత్రమే కాదు, ఆర్థిక వనరుల లేమి అనేది చికిత్సకు అవరోధం కాకుండా జాగ్రత్తపడేలా అనూహ్య అనారోగ్య పరిస్థితుల ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తుంది” అని సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & నేషనల్ హెడ్ (కన్జూమర్ క్లెయిమ్స్) రాజగోపాల్ రుద్రరాజు తెలిపారు. చాలా మటుకు హృద్రోగ సమస్యలకు ప్రారంభ దశ సంకేతాలైన ఛాతీ నొప్పిని లేదా అసౌకర్యాన్ని చాలా మటుకు పేషంట్లు అస్సలు పట్టించుకోరని 78 శాతం మంది డాక్టర్లు తెలియజేయడం గమనార్హం. చాలా మంది పేషంట్లు శ్వాస ఆడకపోవడాన్ని పట్టించుకోరు. అలసట వల్ల వచ్చి ఉంటుందని కొట్టిపారేస్తుంటారు. ఇది వైద్య పరీక్షల్లో జాప్యానికి దారి తీస్తుంది. అనారోగ్యకరమైన డైట్‌తో పాటు అత్యధిక ఒత్తిడి అనేది భారత్‌లో హృద్రోగ కేసులు పెరుగుతుండటానికి కీలక కారణంగా నిలుస్తోంది. గుండె తీవ్రంగా దెబ్బతిన్న తర్వాతే చాలా మంది పేషంట్లు వైద్య చికిత్స కోసం వెళ్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ప్రారంభ హెచ్చరిక సంకేతాలను పట్టించుకోకపోవడమో లేక కొట్టిపారేయడమో జరుగుతోందని కార్డియాలజిస్టులు తెలియజేశారు. ప్రతి పది మంది డాక్టర్లలో దాదాపు ఎనిమిది మంది డాక్టర్లు చెప్పినదాన్ని బట్టి పేషంట్లు చాలా మటుకు ఛాతీ నొప్పిని పట్టించుకోవడం లేదు. చాలా మంది అలసట, శ్వాస తీసుకోలేకపోవడాన్ని ఒత్తిడి లేదా రొటీన్‌గా అలిసిపోవడంగా కొట్టి పారేస్తున్నారు. గుండె తీవ్రంగా దెబ్బతిన్న తర్వాతే పేషంట్లు ఆస్పత్రులకు వస్తున్నట్లు, దీనివల్ల చికిత్స మరింత సంక్లిష్టంగాను ఉంటోందని, ఫలితాలు అనుకూలంగా ఉండటం లేదని 60 శాతం మంది పైగా కార్డియాలజిస్టులు తెలిపారు.

ఆరోగ్య సంరక్షణ లభ్యత, ఆర్థిక సన్నద్ధతలో గణనీయమైన సవాళ్లను ఈ విషయాలు తెలియజేస్తున్నాయి. మెట్రో నగరాల వెలుపల అధునాతన వైద్య చికిత్సల లభ్యత అంతంత మాత్రంగానే ఉంటున్నట్లు 39 శాతం మంది కార్డియాలజిస్టులు తెలపగా, అడ్వాన్స్‌డ్ కార్డియాక్ ట్రీట్‌మెంట్లను పొందడానికి ఆర్థిక సన్నద్ధత కలిగిన పేషంట్ల సంఖ్య 40 శాతం లోపే ఉంటోందని 59 శాతం మంది తెలిపారు. చికిత్స అవసరాలు మరియు ఆర్థిక సామర్థ్యాలకు మధ్య అంతరం అనేది సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తోంది.

పురుషులు, మహిళలకు సంబంధ విశేషాలను కూడా సర్వే వెల్లడించింది. మహిళలకు కూడా పురుషులతో సమానంగా కార్డియాక్ రిస్కులు ఉంటున్నాయని 34 శాతం మంది డాక్టర్లు తెలపగా, మహిళల కార్డియాక్ లక్షణాలు చాలా మటుకు పట్టింపునకు నోచుకోవడం లేదని, ఫలితంగా పెద్దగా వైద్య పరీక్షల దాకా వెళ్లడం లేదని 16 శాతం మంది తెలిపారు.

పరిశ్రమ నివేదికల ప్రకారం భారత్‌లో అత్యధిక మరణాలకు కార్డియోవాస్కులర్ వ్యాధులు (సీవీడీ) కారణంగా నిలుస్తున్నాయి. 40-69 ఏళ్ల వారిలో ఇది అత్యధికంగా ఉంటోంది. సీవీడీల తీవ్రత పెరుగుతుండటానికి అధిక రక్తపోటు, మధుమేహం, ఒత్తిడిలాంటి లైఫ్‌స్టయిల్ ఆధారిత అంశాలు కారణంగా ఉంటున్నాయి. గత అయిదేళ్లలో కార్డియాక్ మెడికేషన్స్ అమ్మకాలు 50 శాతం పైగా పెరగడం గమనార్హం. ఇటు అవగాహన, అటు వ్యాధి భారం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోంది. అలాగే, 40 ఏళ్ల లోపు వారిలో హార్ట్ ఎటాక్‌లు పెరుగుతున్న సందర్భాలు కూడా గణనీయంగా ఉంటున్నాయి. కదలిక లేని జీవనవిధానాలు, సరైన ఆహారపుటలవాట్లు లేకపోవడం, తగినంత నిద్ర లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. భారతదేశపు ప్రజలపై హృద్రోగ ప్రభావాన్ని తగ్గించే దిశగా నివారణ, ముందస్తుగా గుర్తింపు, హృద్రోగాలను అదుపులో ఉంచడం వంటి అంశాలపై సత్వరం దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకతను ఈ ట్రెండ్స్ తెలియజేస్తున్నాయి.

Next Story