భర్తకు జిల్లా కలెక్టర్ బాధ్యతల్ని అప్పగించిన భార్య.. ఎక్కడో తెలుసా?
Kerala: Husband takes over as Alappuzha collector from wife. ''ఇక ఈ జిల్లా వ్యవహారాలన్నింటినీ మీరే చూసుకోవాలి'' అంటూ భర్తకు భార్య కలెక్టర్ బాధ్యతలను అప్పగించింది.
By అంజి Published on 27 July 2022 11:19 AM GMT''ఇక ఈ జిల్లా వ్యవహారాలన్నింటినీ మీరే చూసుకోవాలి'' అంటూ భర్తకు భార్య కలెక్టర్ బాధ్యతలను అప్పగించింది. ఈ అరుదైన సంఘటనకు కేరళలోని అలప్పుజా జిల్లా కలెక్టరేట్ వేదికైంది. భర్తకు కలెక్టర్ బాధ్యతలను అప్పగించిన భార్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ అధికార బదిలీని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కార్యకర్తలు కలెక్టర్ బయట తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు. దీంతో కలెక్టర్ కార్యాలయం వెలుపల గందరగోళం నెలకొంది.
ఇప్పటి వరకు అలప్పుజా జిల్లా కలెక్టర్‌గా ఉన్న రేణు రాజ్‌ను బదిలీ చేస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో కేరళ ప్రభుత్వం జాయింట్ సెక్రటరీగా ఉన్న శ్రీరామ్ వెంకిట్రామన్‌కు బాధ్యతలు అప్పగించింది. రేణ్‌రాజ్, శ్రీరామ్ భార్యభర్తలు. వృత్తిరీత్యా వారు డాక్టర్లు. ఆ తర్వాత ఐఏఎస్‌లు అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. మంగళవారం నాడు రేణురాజ్ నుంచి శ్రీరామ్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. రేణు రాజ్ తన సీటులో కూర్చోమని శ్రీరామ్‌ను ఆహ్వానించారు. అయితే ఇంతటి అరుదైన సన్నివేశానికి వేదికైన అలప్పుజా కలెక్టర్ నిరసనలతో హోరెత్తింది.
నిరసనలు ఎందుకంటే?
ఈ నిరసనలకు కారణం.. గతంలో శ్రీరామ్ వెంకట్రామన్‌పై నమోదైన కేసే. 2019లో శ్రీరామ్.. తన స్నేహితురాలు వఫా ఫిరోజ్‌తో కలిసి అతివేగంగా కారు నడుపుతూ ద్విచక్రవాహనంపై వెళ్తున్న జర్నలిస్టును ఢీకొట్టారు. దీంతో జర్నలిస్ట్ చనిపోయాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు విచారణ ఎదుర్కొంటున్నాడు. 2020లో కేరళ ప్రభుత్వం అతడిని తిరిగి విధుల్లోకి తీసుకుంది. అయితే తాజాగా అలప్పుజా జిల్లా కలెక్టర్‌గా శ్రీరామ్ బాధ్యతలు ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ''జిల్లా కలెక్టర్ అంటే జిల్లా మేజిస్ట్రేట్'' అని, ఆ హోదా బాధ్యతలు నిందితుడికి అప్పగిస్తే ప్రజలకు ఏం న్యాయం చేయగలడని కాంగ్రెస్ అంటోంది. ఈ నేపథ్యంలోనే అతని పోస్టింగ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తోంది.