బెల్జియం యువతిని పెళ్లాడిన.. కర్ణాటక ఆటో డ్రైవర్‌

Karnataka Auto driver marries a Belgium girl in Hampi. బెల్జియంకు చెందిన యువతిని కర్ణాటకకు చెందిన ఆటో డ్రైవర్‌ పెళ్లి చేసుకున్నాడు.

By అంజి  Published on  26 Nov 2022 10:19 AM IST
బెల్జియం యువతిని పెళ్లాడిన.. కర్ణాటక ఆటో డ్రైవర్‌

బెల్జియంకు చెందిన యువతిని కర్ణాటకకు చెందిన ఆటో డ్రైవర్‌ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుక సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర్‌కు చెందిన ఓ స్థానికుడు హంపిలోని విరూపాక్ష దేవాలయంలో బెల్జియం మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహ వేడుక జనాల దృష్టిని ఆకర్షించింది. అలాగే ఈ వేడుక నెట్టింట క్షణాల్లో వైరల్‌గా మారింది. శుక్రవారం ఉదయం 9.25 నిమిషాలకు కుంభ లగ్నాన్ని పురస్కరించుకుని ఇద్దరి పెళ్లి జరిగింది.

నాలుగు సంవత్సరాల డేటింగ్ తర్వాత, ఈ ప్రేమ జంట దక్షిణ భారత వివాహ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బెల్జియంకు చెందిన కామిల్ అనే సామాజిక కార్యకర్త.. తన కుటుంబంతో కలిసి భారతదేశాన్ని సందర్శించినప్పుడు హంపిలో ఆటో డ్రైవర్, గైడ్ అనంతరాజును కలిశారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం వీరి మధ్య ప్రేమకు పునాది వేసింది. ఈ క్రమంలో ఈ జంట పెళ్లి చేసుకోవాలనుకుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా వివాహం ఆలస్యమైంది.

కామిల్‌ తల్లిదండ్రులు వారి వివాహ ఊరేగింపును బెల్జియనంలో నిర్వహించాలని భావించారు. అయితే అనంతరాజు కుటుంబం వారిని హంపిలో భారతీయ సంప్రదాయ ప్రకారం చేయమని ఒప్పించింది. దీంతో గురువారం సాయంత్రం వీరి నిశ్చితార్థం జరగగా.. నిన్న ఉదయం హంపిలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. బెల్జియం నుంచి యువతి తరఫున బంధువులు 50 మందికిపైగా వచ్చారు. అనంతరాజు ఆటో డ్రైవర్‌గానే కాకుండా హంపి గైడ్‌గా కూడా పనిచేసి చారిత్రక హంపి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని పర్యాటకులకు చెబుతున్నారు.

Next Story