స్కూల్‌లో బాంబు కలకలం.. సరదా కోసమే ఇలా చేశానన్న బాలుడు

Bomb scare in Bengaluru school.. Minor boy did it for fun, sent to Juvenile Board. కర్ణాటకలోని బెంగళూరులో గల ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం కలకలం రేపింది.

By అంజి  Published on  7 Jan 2023 3:24 PM IST
స్కూల్‌లో బాంబు కలకలం.. సరదా కోసమే ఇలా చేశానన్న బాలుడు

కర్ణాటకలోని బెంగళూరులో గల ఓ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్‌ రావడం కలకలం రేపింది. బెంగళూరులోని ప్రఖ్యాత నేషనల్ అకాడమీ ఫర్ లెర్నింగ్ ( ఎన్‌ఎఎఫ్‌ఎల్ ) స్కూల్‌కు బూటకపు బాంబు బెదిరింపు రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసును కర్ణాటక పోలీసులు శనివారం ఛేదించారు. దీనంతటికీ కారణమైన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల నుంచి మైనర్ బాలుడిని పోలీసులు తీసుకెళ్లి రాష్ట్ర జువైనల్ జస్టిస్ బోర్డు కస్టడీకి అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు బాలుడిని ఐపి అడ్రస్ ద్వారా గుర్తించి, ప్రశ్నించగా, సరదాగా గడిపేందుకే బాలుడు ఇలా చేశానని చెప్పాడన్నారు. షాపింగ్ మోడ్ గూగుల్ సెర్చ్ నుంచి స్కూల్ అధికారిక ఈమెయిల్ ఐడీ వచ్చిందని పోలీసులకు చెప్పాడు. బెంగళూరులోని బసవేశ్వర నగర్ ప్రాంతంలో శుక్రవారం బాంబు బెదిరింపుతో నేషనల్ పబ్లిక్ స్కూల్ (ఎన్‌పిఎస్) గ్రూప్ నిర్వహిస్తున్న NAFL స్కూల్ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల అధికారిక ఈమెయిల్ ఐడీకి బాంబు బెదిరింపు వచ్చింది. ఆవరణలో నాలుగు జిలెటిన్‌ స్టిక్స్‌ ఉంచామని, భోజనం చేసే సమయంలో అవి పేలిపోతాయని ఈమెయిల్‌ పేర్కొంది.

పాఠశాల సిబ్బంది వెంటనే జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. దాదాపు 1000 మంది పాఠశాల విద్యార్థులను తరగతి గదుల నుంచి బయటకు పంపి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పరిణామం తల్లిదండ్రులు మరియు స్థానిక నివాసితులలో భయాందోళనలను కూడా రేకెత్తించింది. వందలాది మంది తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని, ఈ ఘటన గురించి తెలుసుకుని తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తమ పిల్లలను చూడటానికి పాఠశాల ఆవరణలోకి అనుమతించాలని కోరారు. అనంతరం పిల్లలను వారితో పంపించారు. బాంబు నిర్వీర్యం, డాగ్ స్క్వాడ్ పాఠశాల ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించి.. దీనిని బూటకపు ముప్పుగా ప్రకటించారు.

Next Story