10వ వార్షికోత్సవం సందర్భంగా ‘లెగసీ అకౌంట్’ను ప్రారంభించిన బంధన్ బ్యాంక్
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశపు యూనివర్సల్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ కొత్తగా తమ ప్రీమియం ప్రోడక్ట్ అయిన లెగసీ సేవింగ్స్ అకౌంట్‌ను ఆవిష్కరించింది.
By న్యూస్‌మీటర్ తెలుగు
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతదేశపు యూనివర్సల్ బ్యాంకుల్లో ఒకటైన బంధన్ బ్యాంక్ కొత్తగా తమ ప్రీమియం ప్రోడక్ట్ అయిన లెగసీ సేవింగ్స్ అకౌంట్‌ను ఆవిష్కరించింది. విశిష్టమైన బ్యాంకింగ్ అనుభూతిని కోరుకునే సంపన్న కస్టమర్ల కోసం ఇది రూపొందించబడింది. శ్రేష్ఠమైన బ్యాంకింగ్ సేవలను అందిస్తూ బ్యాంకు 10 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది ఆవిష్కరించబడింది.
లెగసీ సేవింగ్స్ అకౌంటుతో వరల్డ్ ఎలీట్ మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డు లభిస్తుంది. దీనితో దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లకు యాక్సెస్ (సహవాసికి కూడా), తాజ్ ఎపిక్యూర్ సభ్యత్వం, కాంప్లిమెంటరీ సినిమా మరియు ఈవెంట్ టికెట్లు, నిర్దిష్ట క్లబ్‌లలో గోల్ఫ్ సెషన్లు మొదలైన ప్రయోజనాలు లభిస్తాయి. ప్రత్యేకంగా రిలేషన్‌షిప్ మేనేజర్లు, లాకర్ రెంటల్స్‌పై జీవిత కాల డిస్కౌంటు, ట్రావెల్, వైద్య, విద్య, లెగసీ, ఎస్టేట్ ప్లానింగ్ అవసరాల కోసం నిపుణుల కన్సల్టింగ్ సేవలను కూడా లెగసీ సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులు పొందవచ్చు. దీనితో లైఫ్‌స్టయిల్, ఫైనాన్షియల్, ట్రావెల్ తదితర అంశాలకు సంబంధించి విస్తృతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
అంతేగాకుండా, నగదు డిపాజిట్లు, ఆర్‌టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ సహా అపరిమిత ఉచిత లావాదేవీల ప్రయోజనాలను అందుకోవచ్చు. రూ. 1 కోటి వరకు ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ. 20 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా, రూ. 5 లక్షల వరకు పర్చేజ్ ప్రొటెక్షన్‌లాంటి అధిక స్థాయి బీమా కవరేజీని కూడా లెగసీ కస్టమర్లు పొందవచ్చు.
“బంధన్ బ్యాంక్ 10 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒక గర్వకారణమైన, కృతజ్ఞతాపూర్వకమైన తరుణం. లెగసీ సేవింగ్స్ అకౌంటును ఆవిష్కరించడం ద్వారా సమ్మిళిత, సుస్థిర వృద్ధి లక్ష్యాలకు కట్టుబడి ఉంటూనే మరిన్ని వినూత్నమైన సొల్యూషన్స్, ప్రపంచ స్థాయి అనుభూతులు అందించాలన్న నిబద్ధతతో మరో దశాబ్దంలోకి మేము అడుగు పెడుతున్నాం. మా ప్రస్థానంలో రాబోయే దశాబ్దాల్లోనూ ఉద్యోగుల నిబద్ధత, భాగస్వాముల మద్దతుతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తూ, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం” అని బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈవో Mr. పార్థ ప్రతిమ్ సేన్‌గుప్తా తెలిపారు.
2025 జూన్ 30 నాటికి 3.1 కోట్ల కస్టమర్లు, రూ. 1.55 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ. 1.34 లక్షల కోట్ల రుణాలతో బంధన్ బ్యాంకు జాతీయ స్థాయి సంస్థగా ఆవిర్భవించింది. సమ్మిళితత్వం, కస్టమర్ల ప్రయోజనాలు లక్ష్యంగా సేవలు అందించాలన్న మార్గదర్శక సూత్రాలకు కట్టుబడి ఉంటూ, రాబోయే దశాబ్ద కాలంలో అధిక వృద్ధి సాధించడం, నవకల్పనలను ఆవిష్కరించడం, నమ్మకాన్ని పెంపొందించుకోవడంపై బ్యాంకు మరింతగా దృష్టి పెట్టనుంది.