చిన్నారికి అరుదైన వ్యాధి.. చికిత్సకు రూ.11 కోట్లు ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి

An unknown person gave Rs.11 crores for the treatment of a child suffering from a rare disease. స్పైనల్ మస్కులర్ అట్రాఫీ (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్న 15 నెలల చిన్నారి

By అంజి  Published on  22 Feb 2023 4:58 AM GMT
చిన్నారికి అరుదైన వ్యాధి.. చికిత్సకు రూ.11 కోట్లు ఇచ్చిన అజ్ఞాత వ్యక్తి

స్పైనల్ మస్కులర్ అట్రాఫీ (ఎస్‌ఎంఏ)తో బాధపడుతున్న 15 నెలల చిన్నారి నిర్వాణ్‌ చికిత్స కోసం ఓ అజ్ఞాత వ్యక్తి రూ.11 కోట్ల విరాళం అందించాడు. తన పేరు చెప్పకుండా ఈ మొత్తాన్ని క్రౌడ్‌ ఫండింగ్‌ అకౌంట్‌లో జమ చేశాడు. కేరళకు చెందిన చిన్నారి నిర్వాణ్ చికిత్సకు డాక్టర్లు దాదాపు రూ. 17.5 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పారు. దీంతో అంత స్తోమత లేక చిన్నారి తల్లిదండ్రులు చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ఖాతాను ప్రారంభించారు. ఎర్నాకులానికి చెందిన నేవీ అధికారి సారంత్‌, అతిథి దంపతుల కుమారుడు నిర్వాణ్‌ పుట్టి 15 నెలలు దాటినా ఇప్పటికీ కాళ్లు కదపలేదు. దీంతో బాబును ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేయించారు.

రిపోర్ట్స్‌లో చిన్నారికి స్పైనల్‌ మస్కులర్‌ అట్రాఫీ టైప్‌ 2 అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. చిన్నారికి రెండేళ్లు రాకముందే మెడిసన్‌ వేస్తే చికిత్స చేయడానికి వీలు అవుతుందని డాక్టర్లు తెలిపారు. ఆ మెడిసన్‌ను అమెరికా నుంచి తెప్పించి వైద్యం చేసేందుకు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. అతడికి మరో 8 నెలల్లో చికిత్స అందించాల్సి ఉంది. చికిత్స కోసం చిన్నారి కుటుంబం ఇటీవల క్రౌడ్‌ఫండ్‌ను ప్రారంభించింది. ఫిబ్రవరి 19 వరకు 72,000 మంది దాతల నుండి 5.42 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఫిబ్రవరి 20న ఓ అజ్ఞాత వ్యక్తి రూ.11 కోట్లను క్రౌడ్‌ ఫండింగ్‌లో జమ చేశాడు. ఇది చూసి చిన్నారి కుటుంబం ఆశ్చర్యపోయింది.

ఫేస్‌బుక్‌లో ఇదే విషయాన్ని తెలుపుతూ.. చిన్నారి కుటుంబం ఇలా రాసింది.. ''నిర్వాన్ స్పైనల్ మస్కులర్ అట్రాఫీ చికిత్స పట్ల మీ తిరుగులేని మద్దతు, ప్రార్థనలు, విరాళాలకు మేము మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా కుటుంబం పట్ల మీ కరుణ, దయ స్పైనల్ మస్కులర్ అట్రాఫీకి వ్యతిరేకంగా మా కొడుకు చేస్తున్న పోరాటం కోసం పోరాడేందుకు మాకు శక్తినిచ్చాయి. మేము మీ అందరితో ఒక శుభవార్తను పంచుకోవాలనుకుంటున్నాము. మేము అజ్ఞాత దాత నుండి 1.4 మిలియన్ డాలర్ల గణనీయమైన విరాళాన్ని అందుకున్నాము. వారి దాతృత్వం నిర్వాణ్ చికిత్సకు అవసరమైన నిధులను సేకరించే మా లక్ష్యానికి చేరువ చేసింది. కష్టాల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయడానికి నిస్వార్థంగా ముందుకు వచ్చే దేవదూతలు ప్రపంచంలో ఇంకా ఉన్నారని తెలుసుకోవడం హృదయపూర్వకంగా ఉంది. నిర్వాణ్ వేగంగా కోలుకోవాలని ప్రార్థించడం కొనసాగించాలని మీ అందరినీ నేను కోరుతున్నాను.''

స్పైనల్ మస్కులర్ అట్రాఫీ అనేది అరుదైన జన్యుపరమైన వ్యాధి. ఇది కండరాల బలహీనతకు కారణమవుతుంది. ఇది కదలికను కోల్పోయేలా చేస్తుంది. శ్వాస తీసుకోవడం, తినడం వంటి రోజువారీ కార్యకలాపాలను కష్టతరం చేస్తుంది. వ్యాధి తీవ్రంగా ఉంటుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే శాశ్వత వెంటిలేషన్ లేదా మరణానికి దారి తీయవచ్చు.

Next Story