భారత్ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు దేశ భక్తిని చాటే గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టింది. ప్రజలు కూడా తమకు తెలిసిన రితీలో దేశ భక్తిని చాటుకుంటున్నాడు. తాజాగా తమిళనాడుకు చెందిన యూఎస్‌డీ రాజా అనే సూక్ష్మ కళాకారుడు తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. కంటిలో జాతీయ జెండా పెయింటింగ్‌ను వేసుకున్నాడు. ఇందుకు ఎనామిల్ పెయింట్‌ను వాడాడు. స్వతహాగా స్వర్ణకారుడైన రాజాది.. కోయంబత్తూరులోని కునియముతుర్. రాజా ఎన్నో సూక్ష్మ కళా చిత్రాలను రూపొందించి పేరు తెచ్చుకున్నాడు.
ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజా రకరకాల పెయింటింగ్స్ గీస్తున్నాడు. ఈ ఏడాది 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వినూత్న కళకు శ్రీకారం చుట్టాడు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రజలకు ఒక అద్భుతమైన కళాఖండాన్ని అందించాలని అనుకున్నాడు. అదే సమయంలో ''నాకు జాతీయ జెండాను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అనే నినాదం గుర్తుకొచ్చిందని, అలా జాతీయ జెండాను కంటిలో రూపొందించాలనుకున్నా'' అని రాజా తెలిపాడు.
జాతీయ జెండాను కంటిలో తీర్చిదిద్దాలని ప్రయత్నించినప్పుడు చాలా ఇబ్బందికి గురయ్యానని రాజా చెప్పాడు. కంటి డాక్టర్‌ను సంప్రదిస్తే, ఇలా చేయడం కంటికి చాలా ప్రమాదని హెచ్చరించారని తెలిపారు. అయితే తన మనసు ఒప్పుకోలేదని, ఎనామిల్ పెయింట్‌తో జాతీయ జెండాను గీసి కంటికి పెట్టుకున్నానని చెప్పారు. మిర్రర్ చూసుకుని తానే స్వయంగా పెయింటింగ్‌ను వేసుకున్నానని, దీన్ని పూర్తి చయడానికి కొన్ని గంటల సమయం పట్టిందన్నారు. 16 సార్లు ప్రయత్నించి విఫలమయ్యానని, చివరకు 17వ సారి విజయం సాధించానన్నారు. అప్పుడు తనకు స్వాతంత్ర్యం వచ్చినట్లు అనిపించిందన్నారు.