మంచి మనసు చాటుకున్న సోనూసూద్..
By తోట వంశీ కుమార్ Published on 17 May 2020 12:37 PM ISTసినీనటుడు సోనూసూద్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. లాక్‌డౌన్‌లో కష్టాలు ఎదుర్కొంటున్న వలస కూలీలకు సోనూసూద్ సాయం చేస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధి కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వలసకార్మికులు ఉపాధి కోసం ముంబైకి వచ్చి చిక్కుకున్నారు. ఈ విషయం తెలిసిన సోనూసూద్.. ఉత్తరప్రదేశ్ కార్మికులను తమ సొంత గ్రామాలకు పంపించేందుకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నారు.
రెండు రోజుల క్రితం ముంబాయి నుంచి లఖ్‌నవూ, హర్దోయ్‌తో పాటు బీహార్, ఝార్ఖండ్ పలు నగరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వలస కార్మికులను పంపించారు. ప్రయాణంలో వారికి అవసరమైన అన్ని సౌకర్యాలతో పాటు భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఉపాధి కోసం వచ్చిన నానా ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను చూస్తుంటే తన హృదయం ద్రవిస్తోందని చెప్పారు. సొంత గ్రామాలకు వెళ్లేందుకు రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను చూసి బాధపడ్డానని అందుకే వారికి సాయం చేస్తున్నాని ఆయన చెప్పారు. ఆఖరి వలస కూలీ తన స్వస్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను కలిసే వరకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూనే ఉంటానని చెప్పారు.