ఏపీ కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. పాత నేతలను దగ్గరకు తీసుకునేందుకు కాంగ్రెస్‌ అధిఫష్టానం యత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని దగ్గరకు తీసుకోవడానికి కాంగ్రెస్‌ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్‌ రెడ్డి పేరును ఊమెన్ చాందీ ప్రతిపాధించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్‌ రెడ్డితో సోనియా ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. కిరణ్ కుమార్‌ రెడ్డి ఢిల్లీకి రావాలని టెన్ జన్‌ పథ్ ఆహ్వానించినట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దుస్థితికి కారణం ఏంటీ?

వైఎస్ఆర్‌ ఆకస్మిక మరణం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు చివరి అంకమైంది. వైఎస్ఆర్‌ మరణంతోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ చనిపోయిందేమో అనిపిస్తోంది. వైఎస్ఆర్‌ అకాల మరణం తరువాత..ఆయన కుమారుడు వైఎస్ జగన్‌ను కూడా కాంగ్రెస్ చేతులారా దూరం చేసుకుంది. ఏమాత్రం ప్రజాభిమానంలేని నేతల మాటలు విని ఓదార్పు యాత్రకు సోనియా అడ్డుపడ్డారు. ఓదార్పు యాత్రకు వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. వైఎస్ జగన్ మాత్రం ప్రజలకు మాట ఇచ్చానంటూ ముందుకు కదిలారు. ఓదార్పు యాత్రతో జగన్ ఏపీలోని ప్రతి గడప తొక్కారు. ప్రజల మనుషుల్లో ఏముందో పసిగట్టి వైఎస్ఆర్‌ కాంగ్రెస్ స్థాపించారు. వైఎస్‌ఆర్‌ సీపీ స్థాపన ఏపీ కాంగ్రెస్‌కు చరమగీతం పాడిందనే చెప్పాలి. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్దులకు డిపాజిట్లు కూడా రాలేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

ఏపీలో అంపశయ్యపై కాంగ్రెస్..!

తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ గురించి మాట్లాడుకునే వారే లేరు. కాంగ్రెస్‌ ఓటు బ్యాంక్‌ 90 శాతం వైఎస్ఆర్‌ సీపీకి టర్న్‌ అయింది. వైఎస్‌ఆర్ కృషి, చాణక్యం, తెగింపుతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ నిలబడగలిగింది. దీనిని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించలేకపోయింది. వైఎస్ఆర్‌ బలాన్ని కాంగ్రెస్ గుర్తించలేక..తమ వల్లనే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబును ఓడించామని టెన్‌ జన్ పథ్ అనుకుంది. ఇక్కడే వైఎస్ జగన్‌ను కూడా తక్కువుగా అంచనా వేసింది. కాని..జగన్‌ మాత్రం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఢీ కొంటూనే తన పని తాను చేసుకెళ్లాడు. గ్రౌండ్ లెవల్లో వైఎస్ఆర్ సీపీకి బలమైన పునాదులు వేశాడు. దీంతో కాంగ్రెస్ కోలుకోలేపోయింది. కాంగ్రెస్‌లో ఉన్న సెకండ్, థర్డ్ లెవల్ నేతలు అందరూ వైఎస్ఆర్ సీపీలోకి వచ్చారు.

ఏపీలో ‘నల్లారి’ మంత్రం పని చేస్తుందా..?

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తమిళనాడు పరిస్థితే. నిజం చెప్పాలంటే అంతకంటే ఘోరం. రఘువీరా రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా టైమ్ పాస్ చేశాడు తప్పితే ఏం చేయలేదు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డేది కూడా రఘువీరా రెడ్డి పరిస్థితే. వైఎస్ఆర్ సీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ వార్ ఉంది. మధ్యలో నేనున్నానంటూ బీజేపీ నేతలు వస్తున్నారు. అప్పుడప్పుడు పవన్ కల్యాణ్ మెరిసిపోతున్నారు. సో..ఏపీలో నష్టపోయిన దానిని కూడా పూడ్చుకోవడానికి కాంగ్రెస్ ఎన్ని ఎత్తులేసినా..ఫలితం శూన్యమే. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పుడో మరిచిపోయారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.