పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులనే హత్య చేసిన కసాయి కొడుకు

By సుభాష్  Published on  24 April 2020 12:49 PM GMT
పెళ్లి చేయడం లేదని తల్లిదండ్రులనే హత్య చేసిన కసాయి కొడుకు

దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. కన్నవారిపైనే పగలు, ప్రతీకారాలు పెంచుకుంటున్నారు. నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులనే కడతేరుస్తున్న కొడుకులను చూస్తుంటే సమాజమే తలదించుకునేలా ఉంది. లోకం ఎటువైపు వెళుతుందో అర్థం కాని పరిస్థితి. తనకు పెళ్లి చేయలేదన్న కోపంతో ఓ కసాయి కొడుకు కనిపెంచిన తల్లిదండ్రులనే దారుణంగా చంపేసిన ఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలై తండ్రాపట్టు సమీపంలోని కుప్పంతాంగల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన గోవిందస్వామి (62), మాంగణి (56) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. గోవిందస్వామి కూలీ పనులు చేసుకుంటూ ముగ్గురు కుమర్తెల పెళ్లిళ్లు చేశాడు. ఇక కొడుకు రామ్‌కుమార్‌ కోసం పెళ్లి సంబంధాలు సైతం చూస్తున్నారు. కొడుకుకు ఎక్కడా సంబంధాలు కుదరకపోవడంతో కొడుకు తల్లిదండ్రుల రగిలిపోయేవాడు. దీంతో తనకు పెళ్లి చేయాలంటే కొడుకు గొడవ పడేవాడు. ఈ క్రమంలో కోపంతో రగిలిపోయిన కొడుకు ఇంట్లో ఉన్న రుబ్బురాయితో తల్లిదండ్రుల తలపై మోది దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు.

ఇక గురువారం తల్లిదండ్రులను చూసేందుకు కుమార్తె ఇంటికి రాగా, తాళం వేసి ఉండటంతో కిటికిలోంచి చూడగా, తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించింది. దీంతో ఆమె కేకలు వేయడంతో స్థానికులు ఏమైందోనని గుమిగూడారు. తలుపులు పగులగొట్టి చూడగా, తల్లిదండ్రులు రక్తపు మడుగులో శవాలై పడివున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.

Next Story
Share it