త్వరలో సూర్య ధృవాల ఫోటోలు
By అంజి Published on 29 Jan 2020 9:29 AM ISTసూర్యుడి ఉత్తర, దక్షిణ ధ్రువాలను తొలిసారిగా ఫొటోలను తీసేందుకు నాసా సిద్ధమవుతోంది. అమెరికా, ఐరోపా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా ‘సోలార్ ఆర్బిటర్’ అనే వ్యోమనౌకను ప్రయోగించనున్నాయి.వచ్చే నెల 7న దీన్ని ప్రయోగించనున్నట్లు అమెరికా రోదసి సంస్థ ‘నాసా’ ప్రకటించింది., బోయింగ్, లాక్‌హీడ్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంలోని యునైటెడ్ లాంచ్ అలయన్స్‌కు చెందిన ‘అట్లాస్-5’ రాకెట్ ద్వారా ఈ వ్యోమనౌకను నిర్ణిత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
ఈ వ్యోమనౌక శుక్రుడు, భూగ్రహాల గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకొని.. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలోకి జారిపోకుండా నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంది. ఆ సమయంలో తనలోని సోలార్ ఇమేజింగ్ పరికరాలతో సూర్యుడి ఉత్తర, దక్షిణ ధ్రువాల ఫొటోలను చిత్రీకరించి నాసాకు పంపుతుంది. మండే అగ్నిగోళం సూర్యుడి గుట్టువిప్పడమే లక్ష్యంగా తొలి అడుగును నాసా పార్కర్ సోలార్ ప్రోబ్‌తో ప్రారంభించింది. 2018లో ప్రయోగించిన ప్రోబ్ మొదటి ఆరువారాలలో శుక్ర గ్రహానికి చేరువగా వెళ్లింది. ఆ సమయంలో శుక్రుడి గురుత్వాకర్షణ శక్తిని వినియోగించుకుని తన కక్ష్య నిడివిని తగ్గించుకుని, వేగాన్ని మార్చుకుని ఏడు సంవత్సరాల అనంతరం 2024నాటికి సూర్యుని ఉపరితలాన్ని చేరుకుంటుంది. అంటే సోలార్ ప్రోబ్ సూర్యుడికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఇంకో 4 ఏళ్ళు పడుతుంది.
సూర్యుడి మధ్యరేఖా ప్రాంతానికి సమాంతరంగా విస్తరించి ఉన్న ప్రదేశాన్ని ‘ఎక్లిప్టిక్ ప్లేన్’గా పేర్కొంటారు. గ్రహాలన్నీ ఇందులోనే పరిభ్రమిస్తుంటాయి. సూర్యుడి వద్దకు ఇప్పటివరకూ ప్రయోగించిన వ్యోమనౌకలన్నీ ఈ ఎక్లిప్టిక్ ప్లేన్‌లోనో.. దానికి దగ్గర్లోనో ఉన్నాయి. సోలార్ ఆర్బిటర్ మాత్రం దాన్ని దాటి వెళుతుంది. ఇందుకోసం శుక్రుడు, భూమి గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఎగువ నుంచి సూర్యుడిని పరిశీలించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.