మెక్సికోలో తెలుగు 'టెక్కీలకు' విపరీతమైన డిమాండ్..
By Newsmeter.Network
ముఖ్యాంశాలు
- తెలుగు టెక్కీలకు మెక్సికోలో మంచి అవకాశాలు
- మెక్సికో వీసాతో మూడేళ్లపాటు యూఎస్ నివాసం
- ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ
- స్థానికులకు సాంకేతిక నైపుణ్యం అంతగా లేదు
- భార్యా పిల్లల్నికూడా తీసుకెళ్లే అవకాశం ఉంది
- కాబట్టి తెలుగు టెక్కీలకు ఇప్పుడిది స్వర్గధామం
హైదరాబాద్ : మెక్సికోలోని గౌదరజారా ఇప్పుడు తెలుగు సాఫ్ట్ వేర్ నిపుణులకు కేంద్రంగా మారింది. గడచిన కొద్ది నెలలు, సంవత్సరాల్లో తెలుగు టెక్కీలు పెద్ద ఎత్తున ఈ నగరానికి తరలివెళ్లారు. ప్రస్తుతం మెక్కికోలో దాదాపు రెండు వేల తెలుగు కుటుంబాలు నివసిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తల ఈ వివరాల్ని అందించారు.
టి.సి.ఎస్, హెచ్.సి.ఎల్ లాంటి బడా ఐటీ కంపెనీలు మొత్తంగా ఓ నూట పాతిక వరకూ ప్రస్తుతం మెక్సికోలో ఉన్నాయనీ, వీటీవల్ల మెక్సికోకు ఐటీ హబ్ గా ప్రత్యేకమైన గుర్తింపు వచ్చిందనీ ఆయన అంటున్నారు.
మెక్సికో వెళ్లాలంటే
తాత్కాలిక వర్క్ వీసాకోసం ముందుగా ఉద్యోగి దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమిగ్రేషన్ కు సదరు ఉద్యోగి దరఖాస్తును సమర్పించాలి. అమోదించిన దరఖాస్తులు మెక్సికన్ కాన్సులేట్ ఆఫ్ ఇండియాకు చేరతాయి. కాన్సులేట్ ని సందర్శించి సంబంధించిన పత్రాలను చూపించేందుకు సగటున ఒక ఉద్యోగికి పదినుంచి పదిహేను రోజుల సమయం ఇస్తారు. తాత్కాలిక వర్క్ వీసా తీసుకోవడం చాలా సులభం. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ పెద్దగా పోటీ లేనట్టే లెక్క.
వీసా నిబంధనలు
· యూఎస్ లో మూడేళ్లపాటు ఉండి పనిచేయాలంటే నాన్ ఇమిగ్రెంట్ ఎన్.ఎ.ఎఫ్.టి.ఎ ప్రొఫెషనల్ వీసా మెక్సికన్, కెనడియన్ పౌరలకు తప్పనిసరి.
· అదే మూడు సంవత్సరాల్లో తమ క్యాలిబర్ ని నిరూపించుకున్న ఎందరో టెక్కీలు పూర్తిస్థాయిలో వీసాలను పునరుద్ధరించుకున్న సందర్భాలు అనేకం
జీవితభాగస్వామికి వీసా
జీవిత భాగస్వామి, 21 సంవత్సరాలకంటే తక్కువ వయసున్న పిల్లలు టిడి నాన్ ఇమిగ్రెంట్ వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వాళ్లెవరూ సంపాదించేవాళ్లు అయి ఉండకూడదు. పిల్లలకు అక్కడే చదువుకునే అవకాశం కూడా ఉంటుంది.
కంపెనీలు మెక్సికోను ఎందుకు ఎంచుకుంటున్నాయి
.ఉద్యోగులకు తక్కువ జీతాలు చెల్లించే అవకాశం
· తీరప్రాంతం లాటిన్ అమెరికాకు, యూఎస్ కు అనుసంధానమై ఉండడం
· యూఎస్ఎతో పోలిస్తే పన్నులు తక్కువ
యూఎస్ లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే గౌదలజరాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. అందువల్ల తెలుగు టెక్కీలకు ఉండడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. గొప్పగా సంపాదించకపోయినా ఉన్నదాంట్లో సుఖంగా బతకడానికీ, సంతోషంగా గడపడానికీ, కుటుంబాన్ని పోషించుకోవడానికీ, నాలుగురాళ్లు వెనకేసుకోవడానికీ ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది.
ఒక మెక్సికో పీసో విలువ రూ.3.69 మాత్రమే. సగటున ఒక భారతీయుడు ఇక్కడ నెలకు 30 వేల పీసోలు అర్జించగలిగే అవకాశం ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీలో రూ.1,10 వేల రూపాయలన్నమాట. ఈ ప్రాంతంలో లివింగ్ కాస్ట్ దాదాపుగా బెంగళూరు కాస్ట్ ఆఫ్ లివింగ్ కి సమానంగా ఉంటుంది.
తేలికగా ఉద్యోగం దొరుకుతుంది..
సగటున ఫ్రెషర్ కి మూడునుంచి ఐదు లక్షల రూపాయలవరకూ ప్యాకేజీని ఈ ప్రాంతంలో పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. యూఎస్ లో ఉద్యోగం సంపాదించాలని తీవ్ర ప్రయత్నాలు చేసి భంగపడినవాళ్లకు మెక్సికోలో చాలా తేలికగా ఉద్యోగం దొరుకుతుంది.
రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఐటీ కారిడార్ మరింతగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నందువల్ల సుదీర్ఘకాలంపాటు ఇక్కడే ఉండి నాలుగు రాళ్లు వెనకేసుకునే అవకాశం ప్రతిభావంతులకు తప్పనిసరిగా దొరుకుతుందన్న హామీ ఇవ్వగలిగిన ప్రదేశంగా దీన్ని అభివర్ణించవచ్చని నిపుణులు అంటున్నారు.
పైగా స్థానికులకు తెలుగు టెక్కీలతో పోలిస్తే సాంకేతిక నైపుణ్యం చాలా తక్కువగానే ఉంటుందని చెప్పొచ్చుకూడా. నాన్ ఇమిగ్రెంట్ ప్రొఫెషనల్ ఎన్.ఎ.ఎఫ్.టి.ఎ వీసాను పొందగలిగితే ఆ వీసామీద యూఎస్ లో మూడేళ్లపాటు నివసించే అవకాశం ఉండడమూ మరో ముఖ్యమైన అంశం.