వుహాన్‌లో చిక్కుకున్న తెలుగమ్మాయి

By Newsmeter.Network  Published on  2 Feb 2020 6:03 AM GMT
వుహాన్‌లో చిక్కుకున్న తెలుగమ్మాయి

చైనాలో కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే ఈ వైరస్‌ బారిన పడి చైనాలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలోని వుహాన్‌ ప్రాంతంలో 400 మంది భారతీయులు చిక్కుకున్నారు. కాగా వీరిని.. స్వదేశానికి తీసుకురావడానికి రెండు ప్రత్యేక విమానాలను భారత్ పంపింది. మొదటి విమానం శనివారం ఉదయం 7.30గంటలకు ఢిల్లీకి చేరుకోగా.. ఇందులో 324 మంది వెనక్కు వచ్చారు.

కాగా కర్నూలు జిల్లాకు చెందిన యువతి వుహాన్‌ లో చిక్కుకుంది. తిరుపతిలోని టీసీఎల్ సెల్ కంపెనీకి చెందిన 58 మంది ఉద్యోగులు గతేడాది ఆగస్టులో శిక్షణ కోసం చైనాకు వెళ్లారు. ఇందులోని 56 మంది శనివారం ప్రత్యేక విమానంలో స్వదేశానికి రాగా.. ఇద్దరు మాత్రం అక్కడే ఉండిపోయారు. వీరిలో కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం బిజివేములకు చెందిన అన్నెం శృతి ఒకరు. జ్వరంతో బాధపడుతున్న కారణంతో ఆమెతో పాటు మరొకరిని శుక్రవారం వుహాన్ నుంచి బయలుదేరిన విమానంలోకి అనుమతించలేదు.

కాగా.. తన గోడును వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పుకున్న శృతి కన్నీరుమున్నీరవుతోంది. తనతోపాటు విమానం ఎక్కించుకోడానికి నిరాకరించిన మరొకరిని చెరోచోట ఉంచారని.. తినడానికి ఆహారం, మందులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో శృతి తల్లి ఆందోళన చెందుతోంది.. తమ బిడ్డను ఇంటికి రప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఆర్మీలో పనిచేస్తూ శృతి తండ్రి చనిపోయారు.

Next Story