దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. చైనా జన్మస్థలమైన కరోనా దాదాపు 200దేశాలకుపైగా చాపకింద నీరులా పాకింది. ఇక కరోనాను కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఇక లాక్‌డౌన్‌ నుంచి కొన్ని సడలిస్తూ కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. విషయం తెలిసిందే. అదే రీతిలో రాష్ట్రాలు కూడా పలు అంశాలలో మినహాయింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

అయితే ఏ మార్గదర్శకాలు జారీ చేసినా.. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. భౌతిక దూరం పాటిస్తేనే కరోనాను కట్టడి చేయవచ్చు. లేదంటే ప్రమాద ఘంటికలు మోగే అవకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

కరోనా కట్టడిలో రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు తప్పనిసరి

ఇక కరోనాను కట్టడిలో భాగంగానే భౌతిక దూరంతో పాటు రోడ్లపై ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడం తప్పనిసరి. ఈ సందర్బంగా పోలీసులు అక్కడక్కడ రోడ్లపై బారికేట్లు, ఐరన్‌ రాడ్లు, కర్రలు, సిమెంట్‌ దిమ్మలు ఇలా ఏది దొరికితే అది అడ్డంగా పెట్టేశారు. ఇక రోడ్లపైకి వచ్చే జనాలను నియంత్రించేంత పోలీసు సిబ్బంది లేకపోవడంతో కీలక రోడ్లను సైతం బ్లాక్‌ చేయడంతో వారికి లాక్‌డౌన్ అమలు చేసే వీలు కలిగింది.

అయితే ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌లో విధించిన ఆంక్షలు చాలా వరకు ఎత్తేశాయి. ఒక్క రెడ్‌జోన్‌లలో మాత్రం కఠినంగా అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపైకి వస్తున్న వాహనాలతో ట్రాఫిక్‌ రద్దీ అయిపోతుంది. దీంతో రోడ్లపై అడ్డంగా ఏర్పాటు చేసిన వాటిని పోలీసులు తీయకపోవడంతో సాఫీగా వెళ్లాల్సిన వాహనాలకు ఇబ్బంది కలిగి మరింత ట్రాఫిక్‌ ఏర్పడుతుంది. ఇలాంటి రోడ్లపైకి వచ్చిన వాహనాల వల్ల భౌతిక దూరం లేకుండా పోతుందనే చెప్పాలి. దీని వల్ల కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్న మాట.

ఇక కొన్ని షాపులకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇవ్వడంతో షాపుల వద్ద ఎక్కువ మంది చేరడం కూడా ఇబ్బంది కలిగించే అంశమే. షాపులు తెరిచినంత మాత్రమే ఇబ్బందులు తలెత్తకపోవచ్చు.. కానీ షాపుల వద్ద భౌతిక దూరం పాటించకపోవడంతో పెద్ద ఇబ్బంది. దీని వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెరిచిన షాపుల వద్ద నిబంధనలను గాలికొదిలేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా పెడచెవిన పెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వారాంతపు సంతలు కూడా మూసే ఉన్నాయి. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా వారాంతపు సంతలు కూడా బాగానే జరుగుతున్నాయి. అందులో చేపల మార్కెట్‌, మటన్‌, చికెన్‌ తదితర షాపుల వద్ద భౌతిక దూరం ఏ మాత్రం పాటించడం లేదు.

ఇలా అధికారుల లోపం కారణంగా కూడా కరోనా వ్యాప్తికి కారణమవుతుందని కొందరు విమర్శలు చేస్తున్నారు. నిబంధనలంటే అందరికి ఒకేలా ఉండాలి.. కొన్ని షాపుల వద్ద నిబంధనలు పాటిస్తే.. మరి కొన్ని షాపుల వద్ద ఎలాంటి భౌతిక దూరం వంటి నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. పోలీసులు, అధికారులు చెప్పే వారు లేక నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని పలువురు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కరోనాను పూర్తిగా కట్టడి చేయాలంటే భౌతిక దూరం పాటించేలా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *