ముఖ్యాంశాలు

  • ఏటా పాముకాటుకు ప్రాణాలు కోల్పోతున్న 46 వేలమంది
  • 270 జాతుల పాముల్లో 60 జాతుల విషం అత్యంత విలువైనది
  • సర్వసాధారణంగా కనిపించే జాతుల పాముల విషం అత్యంత ప్రభావవంతమైనదిగా గుర్తింపు
  • కట్లపాము విషం 40 రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది విరుగుడు మందుగా
  • కట్లపాము విషంలో సహజసిద్ధంగా యాంటీ వెనమ్ గుణాలు

భారత్ లో ఏటా పాముకాటుకు 46వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాచుపాము, జర్రిగొడ్డు, రక్తపింజరి, కట్లపాము, పసిరిక పాము కాటుకు సర్వసాధారణంగా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న విరుగుడు మందులు పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతున్నాయి. సరైన సమయంలో విరుగుడు ఇవ్వలేకపోతే పాముకాటుకు గురైనవాళ్ల ప్రాణాలు దక్కడం గగనమే. పైగా అందుబాటులో ఉన్న పాము విషంతోనే చేసిన విరుగుడు మందులు ఒక్కోసారి సరైన, సత్వర ప్రభావాన్ని చూపలేకపోవచ్చు కూడా.

కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన పరిశోధనల ఫలితాలు కొన్ని జాతులకు చెందిన పాముల విషాన్ని ఉపయోగించి తయారుచేసే విరుగుడువల్ల కచ్చితంగా ప్రాణాలను కాపాడగలిగే అవకాశం ఉందని చెబుతున్నాయి. గతంలో చేసిన పరిశోధనల ఫలితాలవల్ల ఇప్పటివరకూ సేకరిస్తున్న కొన్ని జాతుల పాముల విషంనుంచి మాత్రమే విరుగుడు మందులు తయారవుతున్నాయి. ఇప్పటివరకూ ఈ దిశగా జరిగిన ప్రయోగాల్లో కొన్ని సర్వసాధారణమైన అవే జాతులకు చెందిన పాముల విషాన్ని సేకరించి వాటినుంచి పాముకాటుకు విరుగుడు మందును తయారుచేసే ప్రయత్నాలు పెద్దగా జరగలేదు.

ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ ఏ పాములనైతే ఈ విషయంలో నిర్లక్షం చేశారో వాటినుంచి సేకరించిన విషం ద్వారా తయారు చేసిన పాముకాటు విరుగుడు మందులు సత్ఫలితాలను ఇస్తాయన్న సత్యాన్ని ఈ మధ్యే శాస్త్రవేత్తలు తెలుసుకోగలిగారు. తాచుపాము జాతికి చెందిన రెండు రకాల పాముల విషాన్ని సేకరించి జరిపిన పరిశోధనల్లో వెల్లడైన అంశం ఏంటంటే కొత్తగా తయారుచేయబోయే ఈ పాము విషానికి చెందిన విరుగుడు మందులు అత్యధిక ప్రభావంతమైనవి.

ఇతర ఔషధాల తయారీకి పాము విషం..

భారత్ లో ఉన్న 270 జాతుల పాముల్లో దాదాపుగా 60 జాతుల పాముల విషం అత్యంత విలువైనది తాజా పరిశోధనల్లో గుర్తించారు. కేవలం పాముకాటుకు విరుగుడు మందుల తయారీకి మాత్రమే కాక అనేక విధాలైన ఇతర ఔషధాల తయారీకి కూడా ఈ 60 జాతుల పాముల విషం చక్కగా పనిచేస్తుందని, సత్ఫలితాలను ఇస్తుందని గుర్తించారు.

కొన్ని రకాల తాచు పాములు, రక్తపింజరి, కట్లపాములు, సముద్రపు పాముల కాటు నుంచి రక్షించగలిగే శక్తివంతమైన, ప్రభావవంతమైన విరుగుడు మందులు ఇప్పటికీ మార్కెట్లో పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. నిజానికి వీటి కాటుకు గురైన వారికికూడా గుడ్డిగా అందుబాటులో ఉన్న విరుగుడు మందుల్నే ఇన్నాళ్లూ ఉపయోగిస్తూ వచ్చారు. ఈ పరిశోధనల్లో తేలిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్ లో ఎక్కువగా కనిపించే కట్లపాము విషం ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాంటీ వెనమ్ కంటే 40 రెట్లు ఎక్కువ ప్రభావవంతమైనదిగా గుర్తించారు.

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ది గెర్రీ మార్టిన్ ప్రాజెక్ట్, మద్రాస్ క్రోకడైల్ బ్యాంక్ ట్రస్ట్ సంయుక్తంగా చేసిన అధ్యయనంలో పశ్చిమ బెంగాల్లో కనిపించే ఒక రకం తాచుపాము నుంచి సేకరించిన విషం ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న విషంతో తయారుచేసిన విరుగుడు మందులకంటే మూడు రెట్ల ఎక్కువగా నరాల వ్యవస్థపై, నాడీ మండలంపై ప్రభావాన్ని చూపించినట్టు తేలింది.

నిజానికి ఒళ్లంతా మచ్చలతో ఉండే రక్త పింజరి కరిచినప్పుడు ఆ పాము శరీరంమీద ఎన్ని మచ్చలు ఉన్నాయో అన్ని స్వేద రంధ్రాలనుంచి రక్తం బైటికి వచ్చి ప్రాణాలు పోతాయని గ్రామీణ ప్రాంతాల్లో బలంగా నమ్ముతారు. కానీ ఇక్కడ వైద్యవిజ్ఞానపరంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రక్త పింజరి కరిచినప్పుడు నేరుగా దాని విషం పూర్తిగా నరాల వ్యవస్థపై, నాడీ మండలపై ప్రభావం చూపించి, శరీరంలోని ఆరోగ్యకరమైన అనేక వ్యవస్థలు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఆ విధంగా జరుగుతుంది. కొత్తగా కనుగొన్న పశ్చిమ బెంగాల్ లో కనిపించే తాచుపాము విషంతో తయారు చేసిన పాముకాటు విరుగుడు మందు పూర్తి స్థాయిలో ఇలాంటి ప్రమాదం నుంచి బాధితులను గట్టెక్కించగలుగుతుందని తేలింది.

అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా ఉండే మరో రకం తాచుపాము విషం ఇలాంటి ప్రమాదం ఏర్పడినప్పుడు ఐదు రెట్లు ఎక్కువగా సమర్థంగా పనిచేసినట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పైగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇతరత్రా ఇంకేమీ మందులు కలపకుండానే నేరుగా ఈ రెండు జాతుల కోబ్రాల విషం పూర్తి స్థాయిలో యాంటీ వెనమ్ గా పనిచేయడం శాస్త్రవేత్తలకే ఆశ్చర్యాన్ని కలిగించింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.