ఆరోగ్యానికి వైఎస్ జగన్ 'ఆరు సూత్రాలు'..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Oct 2019 4:20 PM GMT
ఆరోగ్యానికి వైఎస్ జగన్ ఆరు సూత్రాలు..!

  • 150 ఆస్పత్రుల్లో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు
  • నవంబర్ 1 నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు
  • శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారికి నెలకు రూ.5వేలు
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారికి రూ.10వేలు
  • డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు జారీ
  • శానిటేషన్ వర్కర్లకు జీతం రూ.16వేలు
  • గిరిజన మారుమూల ప్రాంతాల్లో బైక్‌లతో వెళ్లి వైద్య సేవలు

అమరావతి : ఆరోగ్య శ్రీ పథకానికి తుది రూపు ఇచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి. 150 ఆస్పత్రుల్లో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని 150 ఆస్పత్రుల్లో పేదలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ చేయాలని ఆదేశించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ వంటి కీలక అంశాలపై అధికారులతో జగన్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.10వేలు

ఆరోగ్యాంధ్రప్రదేశ్‌కు ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులతో అన్నారు. ప్రపంచ ఆరోగ్య ప్రమాణాల ప్రకారం మందుల తయారీ ఉండాలని చెప్పారు.శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఆర్థిక సాయం చేయాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి పింఛన్ ఇవ్వాలన్నారు. ఆరోగ్య రంగం బలోపేతానికి మార్గదర్శక ప్రణాళికను సీఎం జగన్‌ సూచించారు. డిసెంబర్‌ 1 నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునేంత వరకూ నెలకు రూ. 5వేలు లేనిపక్షంలో రోజుకు రూ. 225 ఆర్థిక సహాయం అందించాలని జగన్ ఆదేశించారు. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారితోపాటు తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేల ఆర్థికం సాయం వర్తింపజేయాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు చెప్పారు.

ఆరోగ్యశ్రీలో కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్

రూ. 5వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు సూచించారు. బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందులకు కొరత లేకుండా, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మందులు దొరకడం లేదన్న ఫిర్యాదు ఎక్కడా రాకూడదని హెచ్చరించారు. హెల్త్‌ సబ్‌సెంటర్లలో అభివృద్ది కార్యక్రమాలు కూడా వచ్చే మే నెల నుంచి ప్రారంభమవ్వాలన్నారు. ఆరోగ్యశ్రీలో డబుల్‌ కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ను చేర్చాలని అధికారులకు స్పష్టం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. డిసెంబర్‌ 21న ఆరోగ్యశ్రీ కార్డుల జారీ చేయాలని చెప్పారు. ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్లకు రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కళాశాల విద్యార్థులకు వర్తింప చేయాలని ఆదేశించారు. నెలరోజుల్లో వారికి కూడా పరీక్షలు చేయాలని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పాఠశాల విద్యార్ధుల నుంచే ఈ ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.

కండరాల క్షీణత ఉన్నవారికి పింఛన్

కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నవారికి రూ.5వేల పెన్షన్‌ వర్తింపు చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జనవరి 1 నుంచి పెన్షన్‌ అమలు చేయాలన్నారు. డెంగీ, సీజనల్‌ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలని అధికారులకు చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా బైకుల ద్వారా వైద్య సేవలు అందించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.

జాతీయ రహదారుల పక్కన మద్యం దుకాణాలకు నో

అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రికి వస్తే..డబ్బుల కోసం వేచి చూడకుండా వైద్య పరీక్షలు జరగాలని సీఎం చెప్పారు. దీనికి సంబంధించి ప్రణాళికలతో తన ముందుకు రావాలని అధికారులను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు.

Next Story