భలే మంచి రోజు.. పసందైన రోజు.. అమర గాయకుడు ఘంటసాల జయంతి ఈ రోజు..!

By Newsmeter.Network  Published on  4 Dec 2019 11:05 AM GMT
భలే మంచి రోజు.. పసందైన రోజు.. అమర గాయకుడు ఘంటసాల జయంతి ఈ రోజు..!

గాయకులు చాలామంది ఉంటారు. కానీ గంధర్వ గాయకులు శతాబ్దానికి ఒక్కరో ఇద్దరో జన్మిస్తారు. నేటి తరానికి శ్రీ బాలసుబ్రహ్మణ్యం గంధర్వ గాయకుడైతే, నాటికి,నేటికీ, ఎప్పటికీ గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల. ఘంటసాల అనే పదాన్ని తెలుగు నిఘంటువులో చేర్చి దానికి అర్ధంగా 'బాగా పాటలు పాడేవాడు' అని చెప్పుకోవచ్చు. ఎన్నో మధురమైన గీతాలను పాడి తెలుగు వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన అమర గాయకుడు శ్రీ ఘంటసాల.

ఘంటసాల 04-12-1922న కృష్ణా జిల్లాలోని చౌటుపల్లి అనే కుగ్రామంలో జన్మించారు. పెదపులివర్రు గ్రామానికి చెందిన సావిత్రి గారితో వీరికి 1944 మార్చి 4న వివాహం జరిగింది. సావిత్రి గారు ఘంటసాలగారి మేనకోడలే! విశేషమేమంటే... ఆయన వివాహానికి ఆయనే సంగీత కచేరీ చెయ్యటం. ఆ వివాహాని నాటి ప్రఖ్యాత సినీ రచయిత శ్రీ సముద్రాల రాఘవాచార్యులుగారు విచ్చేసి, వధూవరులను ఆశీర్వదించి, ఘంటసాల గానానికి మంత్రముఘ్ధులై వారిని మద్రాస్ కు రమ్మన్నారు.

స్వర్గసీమలో మొదటిసారి నేపథ్యగాయకుడిగా అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి, నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆపాటకు ఆయనకు 116 రూపాయల పారితోషికం లభించింది. తర్వాత భానుమతి, రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి సహాయ సంగీత దర్శకునిగా పనిచేసే అవకాశం వచ్చింది.

నాటకాల పద్యాల వరవడికి అలవాటుపడ్డ తెలుగు ప్రజలకు, తన పద్య గానంతో ఆకట్టుకున్నారు ఘంటసాల . లవకుశ, పాండవ వనవాసం, నర్తనశాల మొదలైన సినిమాలలో ఆయన పాడిన పద్యాలు

ఆయా పాత్రలు పోషించిన వ్యక్తుల పాత్రలను ఎలివేట్ చేసాయనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు! కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపం, కుంతీ కుమారి ... మొదలైన గీతాలను పాడి వాటికి ప్రాణం పోసారు. అమ్మా సరోజినీ దేవీ, భారతీయుల, చైనా యుద్ధంలాంటి ప్రబోధ గీతాలను పాడారు. సింతసిగురు సిన్నదానా లాంటి జానపదగీతాలను కూడా చక్కగా పాడారు. వీరికి వెంకటేశ్వరస్వామి వారంటే విపరీతమైన భక్తి. వెంకటేశ్వరస్వామి వారి మీద అనేక ప్రైవేటు గీతాలను పాడటమే కాకుండా, శ్రీ వెంకటేశ్వరరమహాత్మ్యం సినిమాలో 'శేష శైలావాస శ్రీ వెంకటేశ' అనే పాట పాడే సన్నివేశంలో నటించారు కూడా!

1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన సినిమాల్లో పాటలు పాడారు. 1974 లో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది.11-02-1974 న అంద‌ర్నీ శోకసముద్రంలో ముంచి ఆయన అమరలోకానికేగారు.

Next Story