కోల్ ఇండియా సమ్మె సైరన్.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Sep 2019 10:46 AM GMT
కోల్ ఇండియా సమ్మె సైరన్.. సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

సింగరేణి: బొగ్గు గనుల్లో 100 శాతం ఎఫ్‌డిఐలను వ్యతేరేకిస్తూ.. జాతీయ బొగ్గు మైనింగ్ యూనియన్లు ఇచ్చిన సమ్మె పిలుపులో.. సింగరేణి ఉద్యోగులు చేరారు. దేశవ్యాప్తంగా 41 యూనియన్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. రామగుండం, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం ప్రాంతాల్లోని సింగరేణి ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు.

ఈ సమ్మె తాకిడికి రామగుండం ప్రాంతంలోని ఏడు అండర్ గ్రౌండ్ బొగ్గు గనులలో.. నాలుగు ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉద్యోగులెవరూ మంగళవారం విధులకు హాజరు కాకపోవడం వలన ఉత్పత్తికి ఆటకం ఏర్పడింది. ఒక్క రామగుండం ప్రాంతంలోనే 15 వేల మంది కార్మికులు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా.. "బొగ్గు గని రంగంలోకి ఎఫ్‌డిఐని అనుమతించడాన్ని మేము నిరసిస్తున్నాము. మొత్తం 41 యూనియన్లు ఐక్యంగా పోరాడుతున్నాయి. బొగ్గు ,మైనింగ్ రంగాల్లో ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా కేంద్రం మాకు హామీ ఇచ్చే వరకు విధుల్లో చేరమని.. బొగ్గు, మైనింగ్ రంగంలో ఎఫ్‌డిఐ పెట్టుబడుల వలన సింగరేణి ఉద్యోగాలపై కూడా ప్రభావం చూపుతుంది”అని గోదావరిఖని ట్రేడ్ యూనియన్ నాయకుడు అన్నారు. గోదావరిఖనిలో పలు గుర్తింపు సంఘాలు బొగ్గు మైనింగ్ రంగంలో ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాయి..

సింగరేణి అండ్ కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) సమ్మె కారణంగా మంగళవారం బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి, కోల్ ఇండియా ఉద్యోగులు సుమారు 65వేల మంది సమ్మెలో ఉన్నారు. దేశంలో మొత్తం బొగ్గు ఉత్పత్తిలో సిఐఎల్ వాటా 80 శాతం. కోల్ ఇండియా సమ్మె కారణంగా మంగళవారం ఒక్కరోజే 1.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

Next Story